Thursday, 14 May 2020

మడి

మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.
అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.
కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.
మన ఆచారాలు మనం పాటించాలి,వాటిని వదిలివేయరాదు.మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు.
ఆచార హీనం నపునంతి వేదాః అని ఆర్ష వాక్యం.
ఆచార హీనున్ని వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం.
అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం.ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.
మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం
మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు.
కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. అంతే
మడి అంటే ఏమిటి ?
మడి అంటే శారీరక శౌచము. ( ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు. ) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.
మడి ఎలా కట్టుకోవాలి ?
రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను.
( ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు. )
మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకోనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి)
శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు.
మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను.
పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము.
మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించింనవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికరావు.
మడితో పచ్చళ్ళు మడితో వడియాలు మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది.
ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవము లోకి వస్తాయి.
నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనంచేస్తున్నాను.

Friday, 2 May 2014

సింహాచల క్షేత్రమహత్యం

ఆదికాలం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 'సింహాచలం' ఒక ప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రం. కైలాసంగా పిలవబడే ఈ పుణ్యక్షేత్రం సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తున, విశాఖ పట్టణానికి ఉత్తరాన 10 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశం అధికభాగం అడవులు, కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండల సముదాయం నీటిధారలతో, సన్నని కాలువలతో కూడివుంది ఇందులో ముక్యమైనది ఈశాన్యంలో ఉన్న హనుమంత ధార. మరికొన్ని ముఖ్యమైన ధారలు సీతమ్మ ధార, సింహాచలధార, మాధవధార, ఇందులో సింహాచల ధార అన్నిటికన్నా పెద్దది. సింహాచలం అంటే 'సింహం యొక్క కొండ' అని అర్థం. ఇది విష్ణువు నాలుగవ అవతారమైన నరసింహుని కొండగా భావించబడుతోంది. "సర్వం విష్ణు మయం జగత్'' అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రతీకగా నరసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది. ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీవరాహ నరసింహస్వామి. యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా, వేదాద్రిలో లక్ష్మీనరసింహుడుగా, నరసింహస్వామి వారిని అనేక రూపాలతో భక్తులు ఆరాధిస్తారు. దశావతారాలలో విడి అవతారాలైన వరాహ, నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహనరసింహునిగా కనిపించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. వరాహ ముఖం, మానవశరీరం, సింహతోకతో కూడిన స్వామివారి శరీరం మరెక్కడా కనిపించదు. ఇక్కడి ప్రజలు స్వామివారిని "సింహాద్రి అప్పన్న'' అని పిలుస్తారు.
బయటనుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తుంది. మిగతా ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయం పడమరముఖంగా ఉంటుంది. పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుండి ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలయిన మూడు ప్రాకారాలతో, అయిదు ద్వారాలతో, నాట్య, ఆస్థాన, భోగ మంటపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. సంతాన గోపాలయంత్రంపై ప్రతిష్టింపబడిన కప్పస్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడివారి విశ్వాసం. ఇక్కడ ఉత్సవమూర్తులు షడ్రూపులు. వాటినే షడ్బేరులు (ఆరు) అంటారు. ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు. ఉత్సవమూర్తి గోవిందరాజులు, కౌతుక మూర్తి మదనగోపాలుడు, శయనమూర్తి వేణుగోపాలుడు, స్నపన (స్నానంచేసే మూర్తి), యోగానంద నరసింహుడు, బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాళ్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాల క్రిందే లెక్క. ఆయా శరీరాలతో, ఆయా కైంకర్యాలను స్వామివారు స్వీకరిస్తూ ఉంటారన్నమాట. మూల విరాట్టు శిలావిగ్రహం కాగా, మిగిలినవి లోహమూర్తులు.
మూలవిరాట్టు :
మూలవిరాట్టు 'వరాహనరసింహ' ప్రహ్లాద మందిరం మధ్యలో చందనపూతతో, లింగాకారంలో దర్శనమిస్తాడు. ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది. ఏడాదిలో ఒక్క అక్షయతదియ (వైశాఖశుద్ధ తృతీయ) రోజు మాత్రమే కొద్ది గంటలసేపు స్వామివారిపై ఉన్న పూతను ఒలిచి, నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది. అప్పుడు త్రిభంగి భంగిమలో రెండుచేతులతో, వరాహ ముఖంతో, నరుని శరీరంతో, సింహ తోకతో స్వామివారు దర్శనమిస్తారు. మూలవరులకి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఉన్నారు. పద్మాసనంలో కూర్చుని, చేతిలో పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్న చతుర్భుజ తాయారు (లక్ష్మీ)కి, ఆండాళ్ సన్నిధులు ఉన్నాయి. ఆళ్వారులకు ఈ ఆలయంలో గౌరవస్థానం కల్పించబడింది. ఇక్కడ భగవద్రామానుజులు, మణవాళ మహాముని, విష్వక్సేన సన్నిధులు కూడా ఉన్నాయి. వారి జన్మ నక్షత్రాలలో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఉంది. వైశాఖ, జ్యేష్ఠ మంటపాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణమండపం కూడా ఉంది. ఈ ఆలయానికి రెండు పుష్కరిణిలు ఉన్నాయి. ఒకటి స్వామి పుష్కరిణి, మరొకటి వరాహ పుష్కరిణి. ఇది కొండ కింద భాగంలో ఉంది. విశేషమైన పండుగ ఉత్సవాలలో స్వామికి ఈ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. కొండ క్రింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి పండుగ సమయాలలో ఊరేగిస్తారు. 'గంగధార'కు వెళ్ళే దారిలో శ్రీత్రిపురాంతక, త్రిపురసుందరి ఆలయం ఉంది. శ్రీత్రిపురాంతక స్వామి ఇక్కడి క్షేత్రపాలకుడు. గంగధార ప్రక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చు. గుడికి వెళ్ళే మార్గంలో శ్రీకాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణదేవీల సన్నిధి ఉంది. హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది.
దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాలవలెనే ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది. ఈ స్థల పురాణం 32 అధ్యాయాలుగా విభజింపబడింది. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిస్తాడు. పురాణాల కథనం ప్రకారం, ఇది త్రేతాయుగానికి చెందినది. మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వార పాలకులైన జయ, విజయలు కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా జన్మిస్తారు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను హింసిస్తుండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించాడు. సోదరుని మరణవార్తతో హిరణ్యకశిపుడు క్రోధుడై దేవతలను, ఋషులను, హరిభాక్తులను హింసిస్తుండగా శ్రీమహావిష్ణువు తన సేవకుల్లో ఒకరైన సుముఖున్ని హిరణ్యకశిపునికి కుమారుడిగా జన్మించమని ఆదేశించగా, అతడు ప్రహ్లాడునిగా జన్మించి, చిన్నతనంనుండే విష్ణుభక్తుడు అయ్యాడు. ఇది సహించక హిరణ్యకశిపుడు అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో ప్రహ్లాదున్ని సముద్రంలో పడవేసి, అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.
అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదునిపై వేయగా స్వామి వచ్చి రక్షిస్తాడు. ఆ సింహగిరే నేటి సింహాచలంగా రూపాంతరం చెందింది. ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష, హిరణ్యకశిపులని వధించిన అవతారాలైన వరాహ, నారసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామి ఇక్కడ వెలిశాడు. భక్తితో ప్రహ్లాదుడు స్వామికోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహనృసింహ స్వామిని పూజించినట్టు పురాణ కథనం. కృతయుగం చివరిలో ఈ ఆలయం నిరాదరణకు గురై కొంత భాగం భూమిలో కప్పబడిపోయింది. తరువాతి యుగంలో చంద్రవంశ రాజు వురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ప్రహ్లాదుని కథ విష్ణుపురాణంలోను, భాగవతంలోను ప్రస్తావించబడింది. సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను, అహోబిలం హిరణ్యకశిపుని వధించిన తరువాత వెలసిన క్షేత్రంగాను పురాణ కథనం.
ఆలయంలో స్వామివారి ప్రధానోత్సవాలు :
ఆగమ శాస్త్రం మరియు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి. కల్యాణోత్సవం, చందనోత్సవం, ధనుర్మాస ఉత్సవం, వారోత్సవం, మాసోత్సవం జరుపుతారు. చందనయాత్ర వీటిల్లో అతి ముఖ్యమైనది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలలనుండి భక్తులు వస్తారు. వైశాఖ మాసంలోని అక్షయతృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు. ఇది శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు. ఈ రోజు స్వామికి చందనం సమర్పించినవారికి, దర్శించినవారికి మోక్షం, ఆనందం కలుగుతాయి. స్వామివారి చందనం తెల్లవారుఝామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తరువాత సాయంత్రం మళ్ళీ చందనపూత వేస్తారు. పన్నెండు మణుగుల చందనం స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు. అవి నరసింహ జయన్తి, ఆషాడ శుద్ధపూర్ణిమ, జ్యేష్ఠ శుద్ధ పూర్టిమ.
ఈ ఆలయం కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు. స్తంభాల మీద రకరకాల నరసింహ మూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు. శ్రీవరాహ స్వామికి, శ్రీనరసిహునికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలం సింహాచలం ఒక్కటే. రెండూ స్వామివారి ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారనే అభిప్రాయం ఉంది.

మాతా అన్నపూర్ణేశ్వరీ:


'అన్నం పరబ్రహ్మ స్వరూపం' అని అన్నారు. భగవంతుని సన్నిధిని కోరుకునే మానవుడు, ముందుగా అన్నాన్ని ప్రణమిల్లమనండని మనుధర్మశాస్త్రం పేర్కొంటోంది. జ్ఞానాన్వేషకులైన మునులు అన్నాన్ని అలక్ష్యం చేయరు. కడుపులో ఆకలి అనే అగ్నిని పుట్టించేది అన్నపూర్ణమ్మకాగా, ఆ మంటని చల్లార్చేది కూడ ఆ చల్లని తల్లే. ఆ తల్లి కాశీనగరంలో కాశీ అన్నపూర్ణేశ్వరిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తోంది.
ఆ అన్నపూర్ణమ్మ తల్లి కాశీలో కొలువై ఉండటం వెనుక ఒక కథ ఉంది. బ్రహ్మదేవుని గర్వమణిచేందుకై పరమశివుడు, బ్రహ్మ తలల్లో ఒక తలను ఖండించగా, బ్రహ్మహత్యాదోషం చుట్టుకుంది. ఆ హత్యాదోషం పరమశివుని కడుపులో ఆకలిమంటగా రూపుదాల్చింది. ఆకలి బాధను తీర్చుకునేందుకై పరమశివుడు కపాల భిక్షాపాత్రను పట్టుకుని యాచిస్తూండేవాడు. ఆ భిక్షపాత్రలో ఆదిశక్తి అన్నం పెట్టగా, ఆ భిక్షాపాత్ర నిండాలన్నది విధి. అందుకై ఆదిశక్తి అన్నపూర్ణ అవతారాన్ని ధరించింది. ఆదిభిక్షువు పాత్రను అన్నంతో నింపింది. ఫలితంగా స్వామిని పట్టుకున్న బ్రహ్మహత్యాదోషం వెనక్కి తగ్గింది.
మరి, ఆ తల్లి వారణాశికి వచ్చిన కథ సంగతి ఏమిటి? ఈశ్వరునికి ప్రియాతిప్రియమైన కాశీ నగరంలో దేవదత్తుడు, ధనుంజయుడు అనే ఇద్దరు సోదరులున్నారు. దేవదత్తుడు అష్టైశ్వార్యాలతో తులతూగుతూండగా, ధనుంజయుడు మాత్రం నిత్య దారిద్ర్యంతో సతమతమవుతుండేవాడు. ఒక రోజు ధనుంజయుడు మణికర్ణికా స్నానఘట్టంలో ముఖ ప్రక్షాళన చేసుకుని, కాశీవిశ్వేశ్వరుని దర్శించుకుని, తినేందుకు ఏమీ దొరక్కపోవడంతో, ఆకలితో నకనకలాడుతూ కాశీ ముక్తి మంటపంలో కూర్చున్నాడు. 'నేను ఇలా ఆకలిదప్పులతో అలమటించడానికి కారణమేమిటి? నేను గతజన్మలో ఎవరికి అన్యాయం చేసాను? అని ఆలోచిస్తూ నీరసంతో నిద్రలోకి జారిపోయాడు. నిద్రలో అతనికొక కల. ఆ కలలో సన్యాసి గోచరించి ఇలా చెప్పాడు. 'దరిద్ర ధనుంజయా! పూర్వకాలంలో కంచిలో శత్రు మర్దనుడనే రాజకుమారుడుండేవాడు. అతనికి హేరంబుడు అనే ప్రియ మిత్రుడూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ వేటకెళ్ళి దారి తప్పిపోయారు. ఆకలితో అల్లాడిపోయారు. అలా తిరిగి తిరిగీ సూర్యాస్తమయ సమయానికి ఓ మునీశ్వరుని దర్శించుకున్నారు. ఆ మునీశ్వరుడు మిత్రులిద్దరినీ తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి మంచి నీళ్లిచ్చి, ఆకలి మంటలు చల్లారేందుకు పాలలో ఉడికించిన బియ్యపుపిండి ఫలహారాన్ని ఇచ్చాడు. ఆకలితో నకనకలాడుతూన్న శత్రుమర్దన రాజ కుమారునికి ఆ పదార్థం అమృతంలా తోచింది. ఒక్క చుక్క మిగల్చకుండా అంతా తాగేశాడు. అతని మిత్రుడు హేరంబునికి ఆ పదార్థం నచ్చక పోవడంతో కొంచెం తాగి, మిగతా వదిలేశాడు. అలా అన్నాన్ని అవమానపరిచి నందుకు హేరంబునిగా ఉన్న నీవు, ఈ జన్మలో దరిద్ర ధనుంజయునిగా జన్మించావు.
రాజకుమారుడైన శత్రుమర్దనుడు నీ అన్న దేవదత్తునిగా జన్మించి సకల భోగాలను అనుభవిస్తున్నాడు. అన్నాన్ని అవమాన పరిచినందుకుగాను నిన్ను అన్నదోషం వెంటాడుతోంది. ఈ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే అన్నపూర్ణేశ్వరీదేవిని శరణు వేడుకో. నియమ నిబంధనలతో అన్నపూర్ణ వ్రతాన్ని అనుసరించి, నీ దరిద్రాన్ని దూరం చేసుకో" అని చెప్పి సన్యాసి అంతర్థానమయ్యాడు. కల నుంచి మేల్కొన్న ధనుంజయండికి అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలో తెలియదు. అప్పట్నుంచి కనబడినవారినంతా అన్నపూర్ణ వ్రతాన్ని ఎలా చేయాలని అడుగసాగాడు. అలా అర్థిస్తూ, అర్థిస్తూ కామరూపదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఓ కోండప్రక్కన కోంతమంది దేవకన్యలు ఏదో పూజను చేస్తూండడం అతని కంట్లో పడింది. వారి దగ్గరకెళ్లి ఎవరిని పూజిస్తున్నారని అడిగిన ధనుంజయునికి, అన్నపూర్ణేశ్వరీదేవిని పూజిస్తున్నామన్న జవాబు లభించింది. అతని సంతోషానికి ఎల్లలు లేవు. ధనుంజయుని అభ్యర్థనతో దేవతలు అతనికి అన్నపూర్ణ వ్రతం చేసే విధానాన్ని చెప్పారు. ఇంటికి తిరిగివచ్చిన ధనుంజయుడు ఎటువంటి ఆటంకం లేకుండా అన్నపూర్ణేశ్వరీ వ్రతాన్ని చేసి, ఆ తల్లిని పూజించి, ఆ తల్లి అనుగ్రహానికి పాత్రమయ్యాడు. దరిద్రబాధలను అనుభవించిన ధనుంజయుడు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు.
ధనవంతుడవగానే ధనుంజయుని కామపిశాచి పట్టుకుంది. కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ మరొక స్త్రీతో కాపురాన్ని మొదలుపెట్టాడు. ఒక రోజు పెద్ద భార్యతో కూర్చుని అన్నపూర్ణ వ్రతాన్ని ముగించిన ధనుంజయుడు చేతికి వ్రత దారంతో చిన్న భార్య ఇంటికి వెళ్ళాడు. నన్ను వెళ్లగొట్టేందుకు నీ పెళ్ళాం ఈ దారాన్ని కట్టిందా? అంటూ ఆ దారాన్ని తెంపి దూరంగా విసిరేసింది అతని రెండవ భార్య. అంతటితో ఊరుకోకుండా ఆ దారాన్ని అగ్నికి ఆహుతి చేసింది. ఉదయాన్నే నిద్రలేచిన ధనుంజయుడు నోముతాడు తన చేతికి లేకపోవడాన్ని చూసి, భయపడి మరొక తాడును కట్టుకున్నాడు.
కానీ, జరగాల్సినదంతా జరిగిపోయింది. అన్నపూర్ణకు అపచారం జరిగిపోయింది. కుబేరునిగా ఉన్న ధనుంజయుడు మరలా కుచేలునిగా మారిపోయాడు. అనంతరం ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ, అతనికి అన్నపూర్ణ కటాక్షం లభించలేదు. ఇక నాకేది గతి అంటూ మరలా కామరూప దేశానికి పరుగెత్తాడు. తనకు అన్నపూర్ణవ్రతం బోధించిన చోట దృశ్యన్ని చూసి, అతనికి ఆశ్చర్యమనిపించింది. అప్పుడు పూజ చేసిన చోట ఒక బావి కనిపించింది. జీవితంపై విరక్తి చెందిన ధనుంజయండు కళ్ళు మూసుకుని ఆ బావిలో దూకాడు. అయితే చీకటిలో బావిలో దూకిన ధనుంజయుడు చనిపోలేదు.
ఒక్కసారిగా బావిలోపల కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగు కనిపించింది. అక్కడ ఓ అద్భుత దృశ్యం అతని కంటబడింది. అక్కడొక కొలను. ఆ కొలను పక్కన పూజలో నిమగ్నమైన దేవతలు. ఎటుచూసినా వేదఘోషలు. చెవులకింపైన సంగీతం. అక్కడ స్ఫటిక శరీరాకృతితో ఓ పురుషుడు ఆనందతాండవం చేస్తున్నాడు. ఆతని కొప్పులో నెలవంక. నుదుట మూడు కన్నులు. ఆ శరీరమంతా ఆభరణాలతో ధగధగ మెరిసిపోతోంది. ఆయనకు ఎదురుగా ఓ రత్న సంహాసనంపై ఓ మాత కుర్చుని అతని నృత్యాన్ని ఆసక్తితో చూస్తోంది. ఇంతలో కొంతమంది దేవతలు ధనుంజయుని చూసి అతడిని గెంటి వేయడానికి ఉద్యుక్తులయ్యారు. అప్పుడా మాత వారిని వారించింది. ఆమె ధనుంజయుని దగ్గరకు పిలిచి, "నువ్వు ఇన్నాళ్ళూ ఏ అన్నపూర్ణేశ్వరీ దేవిని చూడాలనుకుంటున్నావో, ఆ అన్నపూర్ణేశ్వరీ దేవిని నేను. రుద్రుని రుద్రతాండవాన్ని చూసేందుకై ఇక్కడికొచ్చాను. నువ్వు చేసిన వ్రతాలు, ఆ పుణ్యం వలన నన్ను చూసే భాగ్యానికి నోచుకున్నావు. ఇది బ్రహ్మాదులకు కూడ దక్కని అవకాశం" అని చెప్పింది.
అప్పుడు ధనుంజయుడు భక్తి పారవశ్యంతో, "మాతా! మీ ఇద్దరి దర్శనభాగ్యంతో నా జన్మ తరించింది" అని పలికాడు. అన్నపూర్ణేశ్వరీ దేవి చిరునవ్వులు చిందిస్తూ, "ధనుంజయా! ఇకపై ఎవరు అన్నపూర్ణ వ్రతాన్ని చేస్తారో, వారికి కరువు వంటి బాధలుండవు. ఏ ఇంట్లో నన్ను పూజిస్తారో, ఆ ఇంట్లో నేను వచ్చి కొలువుంటాను. ఆ ఇల్లు ఐశ్వర్యాలతో కళకళలాడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి, మరలా వ్రతాన్ని ప్రారంభించు. నీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నేను భూలోకవాసుల కోసం కాశీ నగరానికే వస్తున్నాను. నా కోసం నువ్వొక ఆలయాన్ని నిర్మించు" అని ఆనతిచ్చింది. ధనుంజయుడు అమ్మవారి ఆనతిని అనుసరించి కాశీలో ఓ ఆలయాన్ని నిర్మించాడు. అదే కాశీ అన్నపూర్ణేశ్వరాలయం.
నిత్యాన్నదానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా, అన్నపూర్ణాదేవి తన బిడ్డలైన మనకే కాక సకలజీవరాసులన్నిటికీ, ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. ఇలా జీవకోటికి ఆహారాన్నందించే అన్నపూర్ణాదేవి నిజ నివాసం ఆది స్మశానమైన వారణాసి క్షేత్రం. ఆ క్షేత్రాధిష్ఠాన దేవుడైన ఆ ఆదినాధుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనే కాశీఅన్నపూర్ణా అని పిలుస్తారు. దసరా పండుగ సందర్భాలలో దుర్గాలయంలో దుర్గమ్మ తల్లికి అన్నపూర్ణమ్మ అలంకారాన్ని కూడ చేస్తుంటారు. అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయడంలో పరమార్థం ఏమిటి అని అడిగితే, ఈ అన్నపూర్ణదేవి కూడా అమ్మవారి దివ్యస్వరూపాల్లో ఒక రూపమే. సాక్షాత్తు తన భర్త అయిన పరమేశ్వరుడే ఆదిభిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణా ఆయనకి భిక్షని ప్రసాదిస్తుంది. ఇదీ అలంకారంలోని దృశ్యం. దీన్ని చూసి మనం గ్రహించాల్సింది ఏమంటే, తల్లికి బిడ్డలంటే ఎంతో ప్రేమ. ఏ తల్లైనా తన బిడ్డలందరికీ కడుపునిండా తీండిపెట్టుకోవాలనుకుంటుంది. అందుకోసం ఎంతకష్టాన్నైనా పడుతుంది. అలాగే దుర్గమ్మ కూడా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా మారి, వారి ఆకలిని తీరుస్తోంది. అది ఆమెకి అత్యంత ప్రీతిపాత్రమైన కార్యం. ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తోంది. అంటే ఈ లోకంలో అ అన్నార్తులైన వారినందరినీ సాక్షాత్తు శివ స్వరూపులుగా మనం భావించాలి. అలా ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనమంతా సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవిస్వరూపమే అవుతాం. ఆ న్నార్తుల ఆకలిని తీర్చే అన్నపూర్ణలమవుతాం. లోకంలో ఆకలిని తీర్చడం కన్నామిన్న అయిన దానం ఏముంది? అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు. కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థాన్ని గ్రహించి అన్నదాతలుగా, అన్నపూర్ణలుగా మారాలి. వీలైనంత వరకూ అన్నార్తులు అలమటించి పోకుండా కాపాడాలి. ఒక్కసారి ఆ నిత్యాన్నదానేశ్వరి అన్నపూర్ణాదేవిని మనకి ఆ శక్తినివ్వమని ఆ బుద్ధినివ్వమని భక్తితో ప్రార్థించుకోవలెను. ఆ తల్లి భక్తాభీష్టప్రదాయిని. మనం కోరుకున్న కోరికలను తీర్చే కల్పవల్లి.

పరబ్రహ్మయే గణపతి

పరబ్రహ్మ స్వరూపమే గణపతి. వేదవేద్యమైన తత్త్వమే గణపతి. ఏదైనా పూజ చేసినా, పునస్కారం చేసినా యే శుభకర్మ చేసినా ప్రథమంగా మనం గణపతిని తలంచుకుంటాం. దానిలో వాడబడే వేదమంత్రం ప్రసిద్ధంగా అందరికీ తెలిసినదే. 

"గణానాం త్వా గణపతిం హవామహే. కవిం కవీనా ముపవశ్రమస్తమమ్‌! జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత. ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్!!" అని ఆ వేదమంత్రం. 

ఈ మంత్రాన్ని బాగా ఏకాగ్రంగా పరిశీలిస్తే పరబ్రహ్మయొక్క తత్త్వం అంతా ఇందులో నిబద్ధం చేశారు మహర్షులు. 

దీని ప్రభావం యేమిటంటే గణములలో గణపతిగా ప్రకాశించే ఓదైవమా! నిన్ను ఉపాసిస్తున్నాము/ఆహ్వానిస్తున్నాము. నువ్వు ఎటువంటి వాడివి అంటే కవీనాం కవిః - కవులకు కూడా కవియైనటువంటి వాడివి. 

ఉపమశ్రవస్తమమ్‌ - పోలికగా చెప్పదగినటువంటి మిక్కిలి కీర్తిగలవాడు అని ఒక అర్థం. సృష్టిలో యేదైనా ఒక గొప్ప వస్తువును చూస్తే ఆ గొప్ప వస్తువును చెప్పడానికి మరొక గొప్పవస్తువుతో పోలుస్తాం. అందంగా ఒక ముఖం ఉంటే చంద్రుడిలా ఉంది అంటాం. అప్పటికే చంద్రుడు అందంగా ఉన్నాడు గనుక. ఇలా పోల్చడానికి లేదా ఆదర్శంగా చెప్పడానికి ఉత్తమమైనటువంటి కీర్తి గలిగినటువంటివాడు అని అర్థం. ఇంకొక అర్థం యేమిటంటే "సర్వేషాం అన్నానాం ఉపమానం యస్య" అంటూ వేదార్థం తెలిసిన వారు వ్యాఖ్యానించారు. ఉపమశ్రవస్తమమ్ అంటే అన్నసమృద్ధి కలవాడు అని ఒక అర్థం. గణపతికి ఎన్ని లక్షణాలు చెప్తున్నారు 

గణానాంత్వా గణపతి గ్ం హవామహే - ఓ గణపతీ అన్నారు. గణపతి అంటే గణములకు పతి. గణములకు పతియైన వాడు ఎక్కడున్నాడు? గణములలోనే ఉన్నాడన్నారు. అంటే గణములలో గణపతిగా ఉన్నటువంటివాడు. అది ఆయనయొక్క గొప్పతనం. ఇంకొకవైపు కవులకు కవియై ఉన్నాడు. అన్న సమృద్ధి కలవాడు. 

జ్యేష్ఠ రాజం - జ్యేష్ఠరాజు అనగానే గణపతి తొలిదైవం అనేమాట ఈ మంత్రంలోనే మనకు కనపడుతోంది. జ్యేష్ఠ అంటే పెద్దవాడు, మొదటివాడు అని అర్థం. రాజా అంటే ప్రకాశించువాడు అని అర్థం. జ్యేష్ఠరాజ అంటే అందరికన్నా మొదటివాడై ప్రకాశించేటటువంటివాడు కనుక జ్యేష్ఠరాజం అన్నారు.

 బ్రహ్మణాం బ్రహ్మణస్పత - బ్రహ్మణస్పతే అని సంబోధిస్తున్నారన్నమాట గణపతిని. ఆయన బ్రహ్మణాం బ్రహ్మణస్పతి - బ్రహ్మణములయందు బ్రహ్మణస్పతిగా ప్రకాశిస్తున్నవాడు కూడా ఆయనే. బ్రహ్మణములు అంటే వేదమంత్రములు అని అర్థం. అంతేకాకుండా కర్మకు వినియోగింపబడేటటువంటి వేదమంత్రములు ప్రత్యేకించి లేదా వేదమంత్రాలని కర్మకు వినియోగించేటప్పుడు బ్రహ్మణములు అని అంటాం అని దీని అర్థం. అంటే బ్రహ్మణ శబ్దం కర్మలను తెలియజేస్తోంది. ఈ కర్మలన్నింటికీ కూడా పతి యెవడో అతడు బ్రహ్మణస్పతి అని చెప్తున్నారు. 

అటువంటి ఓ బ్రహ్మణస్పతీ! ఓ గణపతీ! నువ్వు రావయ్యా అని ఆహ్వానిస్తున్నారు. ఎక్కడికి రావాలి? 
సాదనమ్ - సదనస్య భావమ్ సాదనమ్. సదనము అంటే ఇల్లు అని అర్థం. సాదనమ్ అంటే ఇల్లు లేదా నివాసం అని అర్థం. అయితే అన్ని ఇళ్ళూ సదనాలు అనిపించుకోవు. సదనం అంటే ఎక్కడ యజ్ఞం జరుగుతుందో ఆ చోటుకి సదనం అని పేరు. అంటే ఎవరి ఇంట్లో నిరంతరం దేవతారాధనలు అనే యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో ఆ యిల్లునే సదనం అనాలి. లేకపోతే కొంప అనవచ్చు మనం. గృహం సదనమ్ ఎప్పుడౌతుందంటే యజ్ఞాలు జరిగేటటువంటి ఇల్లే సదనం అవుతుంది. అలాంటి సదనంలోకి రమ్మంటున్నాం గణపతిని. 

ఎలా రావాలి అంటే ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద - నః అంటే మాయొక్క; శృణ్వన్ - విని; మమ్మల్ని విని- మా మనస్సులో ఉన్న భావాలు, మేము చేసే ఈ ప్రార్థనలు మేము పలికే ఈ ఆహ్వానాలు విని రావయ్యా. ఎక్కడికి రావాలి? - మా సదనానికి రావాలి. 

ఎలా రావాలి? ఊతిభిః - శక్తులతో; ఓ గణపతీ! నీయొక్క సమస్త శక్తులతో మా సదనమునకు రావయ్యా అన్నారు. గణపతిగానీ తన సమస్త శక్తులతో వచ్చాడా ఇంక ఆ సదనం దివ్యమైపోతుంది. ఆసదనంలో జరిగే ప్రతియజ్ఞం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. 

అందువల్లనే యజ్ఞం - భగవదారాధన చేసేముందు ఈమంత్రం చెప్పడం ఎందుకంటే గణపతి తన సమస్త శక్తులతో వస్తే ఆ యజ్ఞం చక్కగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇక్కడ గణపతి అనే నామం, కవి అనే నామం, బ్రహ్మణస్పతి అనే నామం ప్రధానంగా మనం చూడవలసినవి. గణములలో గణపతిగా ఉండేటటువంటివాడు; ఇక్కడ గణములు అంటే దేవతా గణాలు అని ఒక అర్థం. కవి అంటే మంత్రములు అని అర్థం. కవి అనే శబ్దం వేదం చాలగొప్ప అర్థంతో వాడింది. అంతేకానీ రచనలు చేసేటటువంటి వాడు కవి కాదు. కవి అనేది వేదశబ్దం. పరమాత్మకు వాడారు. మళ్ళీ వేదమంత్రాలకు వాడారు. దర్శనశక్తి కలవాడిని కవి అని అంటారు. అతీంద్రియమైన విషయాన్ని దర్శించేవాడిని కవి అంటారు. "కవయః క్రాంతదర్శయాః" - కవి యెవరయ్యా అంటే క్రాంతదర్శనశక్తి కలిగినటువంటి వాడు కవి. క్రాంతద్రష్టలన్నమాట. మామూలు కన్ను చూడలేనటువంటి మహత్వాన్ని దర్శించేవాడు కవి. అలా మంత్రములకు కవి అని పేరు. ఎందుకంటే వేదమంత్రములు ఆ పరమాత్మను దర్శిస్తూ, దర్శింపజేస్తున్నాయి కనుకనే వేదమంత్రములను కవి అన్నారు. ఆ కవులకు కవి గణపతి. అంటే వేదమంత్రములన్నీ భగవంతుడిని చూస్తూ ఉన్నాయి. ఆ భగవంతుడు ఈ వేదములను, ఈ ప్రపంచాన్ని, నిరంతరం చూస్తూ ఉంటాడు. కనుక కవులకు కవియైనటువంటివాడు గణపతి అన్నమాట. బ్రహ్మణస్పతి అంటే వేదచోదితమైన కర్మలన్నింటికీ అధిపతియైనటువంటివాడు. ఈ మంత్రంలో ప్రధానంగా మూడు విషయములు చెప్పబడుతున్నాయి. గణములు అంటే దేవతలందరూ చెప్పబడ్డారు. కవి అంటే మంత్రములు చెప్పబడ్డాయి. బ్రహ్మణములు అంటే కర్మలు చెప్పబడ్డాయి. మధ్యలో ఉపవశ్రవస్తమమ్‌ - అన్నసమృద్ధి కలవాడు అని అన్నములు చెప్పబడ్డాయి. ఈనాలుగూ యజ్ఞమునకు కావలసినవి. మొదట కావలసినది దేవతా గణములు; రెండు మంత్రములు కావాలి; మూడు కర్మకావాలి. నాలుగు యజ్ఞమునకు వినియోగింపబడే ద్రవ్యములు కావాలి. ఈ నాలుగింటికీ అధిపతి పరమాత్మయే అని చెప్తున్నారు. దేవతలలో దేవతగా ఉన్నవాడు. పైగా దేవతలకు అధిపతిగా ఉండేటటువంటివాడు. అందుకే గణములలో గణపతి అన్నారు. అదేవిధంగా స్వామి అన్నసమృద్ధి కలవాడు. అంటే యజ్ఞద్రవ్యాలన్నీ ఆయనవల్లే వస్తున్నాయన్నమాట. అటువంటి స్వామి కర్మలకు కూడ పతియైనటువంటివాడు అన్నారు. యజ్ఞములలో వాడబడే వాటి అన్నింటికీ పతి యెవరో అతడే ముందు వస్తే తర్వాత యజ్ఞకర్మ అంతా చక్కగా జరగబడుతుంది. గణపతి అంటే విఘ్నాలు తొలగించే మామూలు దైవం కాదు ఆయన. పరిపూర్ణుడైన పరబ్రహ్మయే గణపతి అని వేదం వర్ణించింది.

సిద్ధులను గుర్తించటం ఎలా?


భారత దేశం కర్మభూమి.లౌకిక ఙ్ఞానానికి అతీతమైన సిద్ధులతో,తమ తపోశక్తితో భారత భూమిని సుసంపన్నం చేసిన సిద్ధులెందరికో ఈ పుణ్యభూమి పుట్టినిల్లు తమ తపోశక్తితో కేవలం,
భారత దేశానికే కాక యవత్త్మానవళికి ఉపకారం చేసే సిద్ధ పురుషులు ఈ నాటికి హిమాలయపర్వత శ్రేణ్ణుల్లో ఉన్నారు. అట్టి మహాత్ముల తపోశక్తి వలననే నేడు భారతావని ఈ మాత్రం అయిన సుభిక్షముగా ఉంది. వారి తపస్సు వలన కలిగే ప్రకంపనలు వలనే నేటి భారత దేశం లో ఇంకా ఆధ్యాత్మికత నెలకొని ఉంది. సిద్ధ పురుషులు అఙ్ఞాతముగా ఉంటూ మానవునికి ఊహకందని సేవలు చేస్తూ ఉంటారు. ప్రకృతి,సూర్యకాంతి,పంచభూతాలు మానవాళికి చేసే ప్రయోజనం ఎటువంటిదో సిద్ధులైన పురుషుల తపోశక్తితో అంతటి ఉపకారం చేస్తు ఉంటుంది.
1)సిద్ధులను గుర్తించటం ఎలా?
2)వారి లక్షణాలు ఎమిటి?
3)వారి నివాసము ఎచ్చట?
వంటివి ఆసక్తికరమైన ప్రశ్నలు . అయితే సిద్ధులను గుర్తించటం అంత తేలికైన విషియం కాదు. భగ్వద్గీత,బ్రహ్మ గీత,సుత సమ్హిత,భాగవతం ఇంకా ఉపనిషత్తులతో అక్కడక్కడ సిద్ధులను గురించి చెప్పబడింది. భగ్వద్గీతలో సాంఖ్యాయోగంలో చెప్పబడిన స్థిథ ప్రాఙ్ఞుని లక్షణాలు పూర్తిగా కలిగి ఉన్నవారిని సిద్ధ పురుషులుగా పేర్కొనవచ్చు.
భగ్వద్గీతలో అర్జునుడు స్థిత ప్రఙ్ఞుని గురించి నాలుగు ప్రస్నలు వేశాడు.
1) స్థిత ప్రాఙ్ఞుడు ఎలా ఉంటాడు? అనగా అతని లక్షణములు ఏమిటి?
2)స్థిత ప్రఙ్ఞులు ఏ విధంగా భాషిస్తారు?
3)స్థిత ప్రాఙ్ఞుడు ఏ రీతిగా ఉంటాడు?
4)స్థిత ప్రాఙ్ఞుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు?
పైనాలుగు ప్రశ్నలలో మొదటి ప్రశ్నయే సమగ్రమయినది. మిగిలిన మూడుప్రశ్నలు అందులోని భాగమే . అత్యంత సమగ్రమైన అర్జునుని ఈ ప్రశ్నకు సాంఖ్య యోగం చివరి వరకూ శ్రీ కృష్ణ భగవానుడు సవివరముగ సమాధానం ఇచ్చాడు. మనస్సులోని కోరికలను పూర్తిగా పాలద్రోలి నిర్మల చిత్తంతో ఆత్మయందే స్థిరంగా ఉండి సంతుష్టి పొందే స్థితిని స్థిత ప్రఙ్ఞత్వం అని అంటారు. అట్టి స్థితిని చేరుకున్న సిద్ధుని ప్రతి చర్యలో పవిత్రత ,శాంతి ,దైవత్వం గోచరిస్తుంది. అట్టి సిద్ధుని ముఖం ఎల్లప్పుడూ తృప్తి ,ఆనందంతో తాండవిస్తుంది. అతని హృదయం నిత్యం బ్రహ్మానంద సాగరంలో తేలియాడూతూంటుంది. మనోవికారాలైన రాగభయక్రోధాదులు అతని దరి చేరవు.శరీరధారులు కనుక కొన్ని భౌతికావసరాలకు తప్ప ఏ వస్తువులు యందు ప్రత్యేకమైన కోరిక గాని అమిత ఇష్టంగాని కలిగిఉండరు.
సిద్ధులైన మహాపురుషులు దర్శనం వలన కలిగే పుణ్యఫలమును గురించి ఒక చిన్న కథ ఉంది.
ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువును " సాధుదర్శనం" వలన కలిగే ఫలం ఏమిటి? అని ప్రశ్నించాడు. దానికి విష్ణువు "నారదా! భూలోకంలో ఇప్పుడే ఒక పేడపురుగు జన్మించింది.వెళ్ళి దానిని అడుగు. నీ ప్రశ్నకు జవాబు లభిస్తుంది"అన్నాడు.
నారదుడు పేడపురుగు వద్దకు పోయి "సాధుదర్శనం వలన కలిగే ఫలము ఏమిటి? "అని ప్రశ్నించాడు. వెంటన్నే ఆ పేడపురుగు మరణించింది. నారదుడు కంగారుపడి విష్ణువుకు జరిగినదంతా చెప్పాడు.
విష్ణువు "నారదా ! భూలోకంలో ఒక గోవు ప్రసవిస్తున్నది.వెళ్ళి ఆ ఆవుదుడను ఇదే ప్రశ్నను అడుగు" అని పంపాడు. నారదుడు తిరిగి భూలోకం వచ్చి అప్పుడే ప్రసవించిన లేగదూడను తిరిగి ప్రశ్నించాడు. ఆ లేగదూడ ప్రశ్న విన్న వెంటన్నే మరణించింది. నారదుడు తనకు గోహత్యా పాపం కలిగింది అని చింతించి ,మళ్ళి విష్ణువు వద్దకు వెళ్ళి జరిగినది అంతా వివరించాడు. వెంటనే శ్రీ మహా విష్ణువు :"ఈ సారి భూలోకంలో ఫలానరాజుగారి భార్య ఇప్పుడే ప్రసవించింది.మగ బిడ్డ పుట్టాడు. ఆ బిద్డను ఈ ప్రశ్న వెయ్యి, నీకు సమాధానం దొరుకుతుంది " అని చెప్పాడు. నారదుడు సందేహించి "శ్రీమన్నారాయణ ! ఇప్పటికే నావలన రెండు మరణాలు జరిగాయని వ్యాకుల పడుతున్నాను. నీ మాయ నాకు అర్ధం కాకుండా ఉంది. మరోక్కసారి నీవు చెప్పినట్లు చెయ్యటానికి ధైర్యం సరిపొవడంలేదు ,నన్ను అనుగ్రహించు తండ్రి ! " అని ప్రార్థించాడు .
శ్రీ మహావిష్ణువు నవ్వి "ఈ సారి నీ ప్రశ్నకు తప్పక జవాబు లభిస్తుంది.పోయిరమ్ము" అని పంపాడు. నారదుడు భూలోకానికి తిరిగి వచ్చి అప్పుడే ప్రసవించిన రాకుమారుని " సిద్ధ పురుషులు దర్శన ఫలం ఏమిటి ?" అని ప్రశ్నించాడు. వెంటనే ఆ రాకుమారుడు నారదునికి నమస్కరించి "మహాత్మ! మీ ప్రశ్నకు, నా జీవితమే జవాబు ! నేను ముందు పేడపురుగుగాజన్మించినప్పు దు మీ దర్శనభాగ్యం వలన ఆవుదూడగా ఉత్తమజన్మ లభించింది. టిరిగి మీ దర్శనం వల్లనే ఉత్తమోత్తమైన ఈ మానవ జన్మ లభించింది " అని జవాబు ఇచ్చాడు.
కాబట్టి, సిద్ధ పురుషులు దర్శనం వలన లభించే పుణ్య ఫలం ఎంతని చెప్పగలం?
సాధూనాం దర్శనం పుణ్యం,
స్పర్శనం పాప నాశనం
సంభాషణం కోటితీర్థం,
వందనం మోక్ష సాధనం II
సాధువులు అయిన ఙ్ఞానులను దర్శించతం వల్ల పుణ్యం, పాద స్పర్శతో పాపనాశనం,సంభాషించటం వలన అన్ని పుణ్యతీర్థాలలో స్నానము ఆచరించటం వలన కలిగే పుణ్య ఫలం, నమస్కారం చెయ్య తం మోక్షదాయకమని భాగవతం లో చెప్పబడింది. ఏ ప్రదేశాలలో సిద్ధ పురుషులు ఆశ్రమాలు నిర్మిచికుంటారో అక్కడి ప్రజలు ఆ సిద్ధులు సాంగత్యంతో పునీతులు అవుతు ఉంటారు.
ఆత్మ ఙ్ఞానం పెంపొందించుకునేవాతావరణం సిద్ధ పురుషుల ఆశ్రమాలలో లభించగలదు. అట్టి మహాపురుషుల ఉనికి అన్ని రకాల తాపత్రయాలను పారద్రోలి సాశ్వతమైన ఆధ్యాత్మిక శాంతిని చేకూర్చుతుంది. నిరంతరం సంసారవ్యామ్మోహంలో కొట్టుమిట్తాదే నేటి ప్రజలు, అట్టి మహాపురుషుల సాంగత్యం కొరకై తరచు ప్రయత్నం చేయ్తుట వలన శాంతి సౌఖ్యాలను పొందగలరు. పలు సిద్ధ పురుషుల జీవిత చరిత్రలు దీనికి ఉదాహరణలు !
శ్రీ రామ జయ రామ జయ జయ రామ !

Thursday, 17 April 2014

శ్రీ గాయత్రీ మహమంత్రం

అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం. అనన్యం,సర్వసిద్ధిప్రదం.

1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11. దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును
14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.
15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23. ద - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.

గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.

గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.
ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగమ్ శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.

తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
వ - నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి
భ - మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
వ - భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
మ - హృదయం
హి - ఉదరం
ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
ద - గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు

ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.



Photo: అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం. అనన్యం,సర్వసిద్ధిప్రదం.

1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11.  దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును
14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.
15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23. ద - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.

గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.

గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.
ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగమ్ శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.

తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
వ - నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి
భ - మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
వ - భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
మ - హృదయం
హి - ఉదరం
ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
ద - గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు

ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.

శ్రీ రామనామ మంత్రం


దశరథనందన శ్రీరామ నమో
అయోధ్య వాసి శ్రీరామ నమో
నీలమేఘశ్యామ శ్రీరమ నమో
జానకీనాథా శ్రీరామ నమో
హనుమత్సేవిత శ్రీరామ నమో
వాలీమర్ధన శ్రీరామ నమో
కోదండపాణి శ్రీరామ నమో
రావణసమ్హార శ్రీరామ నమో
కారుణ్యహృదయా శ్రీరామ నమో
భక్తవత్సల శ్రీరామ నమో

మహిమాన్విత శ్రీరామనామ౦:
ర - ఆత్మ
మ - మనస్సు
ర - సూర్య బీజ౦ - అజ్ఞానాన్ని పోగొడుతు౦ది
అ - చ౦ద్ర బీజ౦ - తాపాన్ని పోగొడుతు౦ది్.
మ - అగ్ని బీజ౦ - పాపాన్ని భస్మ౦ చేస్తు౦ది.
రా - అ౦టే పురుషుడు,
మ - అ౦టే ప్రకృతి

పురుషుడు ప్రకృతి కలిస్తేనే ఈ సర్వ ప్రప౦చ౦ ఏర్పడి౦చి. ఈవిధ౦గా రామ శబ్దానికి నిత్యసత్యమైన పరబ్రహ్మ౦ అని అర్ధ౦. విశ్వమ౦తా పరబ్రహ్మస్వరూపమే కాని మరొకటి లేదు.

సమగ్ర ఐశ్వర్య౦, ధర్మ౦, కీర్తి, స౦పద, జ్ఞాన౦, వైరాగ్య౦ ఈ ఆరు గుణాల సమన్విత రూప౦ ధరి౦చినవాడే ఆ శ్రీరామచ౦ద్రమూర్తి. సకల సద్గుణ కరమై౦ది శ్రీరామనామ౦. రామోచ్ఛారణే సర్వపాప నివారక హేతువని విజ్ఞులు పలికారు. అ౦దుకని సర్వులూ ఆ స్వామి నామాన్ని జపి౦చి తరి౦చాలి.

అ౦తేకాక
’రామ’ లో రా అ౦టే రావణ అని, మ అ౦టే మర్దన అని అర్ధ౦ స్ఫురిస్తో౦ది. అ౦టే రావణ మర్దనుడే రామ అన్నమాట. రావణుడ౦టే కామక్రోధాది దుర్గుణ స్వభావ౦. కనుక ఆ దుర్గుణాలను పోగొట్టేది శ్రీరామ పవిత్రనామార్ధ౦ అని మన౦ స౦భావి౦చుకోవచ్చు.

’రా’ అనే అక్షర౦ పలుకగానే నోరు తెరుచుకొని మనలోని దోషాలు, పాపాలు వెలికిపోతాయి. ’మ’ అనే అక్షర౦ పలుకగానే నోరు మూసుకొని మనల్ని దోష రహితులుగా చేస్తు౦ది. అ౦దుకే రామ అనేది బీజాక్షర యుక్తమైన మ౦త్ర౦.

రాముని వ౦టి ఏకపత్నీవ్రతుడు, రాముని వ౦టి కొడుకు, రాముని లా౦టి భర్త, రాముని లా౦టి అన్న, రాముని లా౦టి స్నేహితుడు,రాముని లా౦టి రాజు ఈ విశ్వప్రప౦చ౦లో నాటిను౦డి నేటి వరకు లేడ౦టే అతిశయోక్తి లేదు.