Monday, 17 February 2014

శివుడి తాండవము - నటరాజ స్వామి

""నట" అనే ధాతువుకు స్పందించడమని అర్ధం. తన భక్తులను ఆనందపారవశ్యంలో ముంచెత్తేందుకు స్వామి అనేక సంధర్బాలలో నాట్యం చేసినట్టు పురాణవచనం. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో,హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు.ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సమ్హారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాదు అనేది విదితం. గజాసురుణ్ణి సమ్హరించేతప్పుడు,అంధకాసుర సమ్హారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.
స్వామి నాలుగు చేతులలో నెమలి ఈకలు కట్టిన జడలతో, ఆ జడలలో ఒక సర్పం, ఒక కపాలం,గంగ,దానిపై చంద్ర రేఖ,కుడి చెవికి కుండలం, ఎడమ చెవికి తాటంకం ,కంఠహారాలతో, నూపురాలతో,కేయూరాంగదాలతో,యఙ్ఞోపవీతంతో, కుడి చేతిలో ఢమరుకం ,మరొక కుడిచేయి అభయ ముద్రను ప్రకటించడం,ఒక ఎడమ చేతిలో అగ్ని,మరొక చేయి సర్పాన్ని ,చేతిలో పెట్టుకున్న మూలయకుణ్ణి చూపిస్తూ, ఎడమకాలు ఎత్తి పెట్టబడినట్లుగా,విగ్రహానికి చుట్టూ ఓ కాంతి వలయం, పద్మాకారంగ చెక్కబడిన పీఠంపై నృత్యం అద్భుతం.

చెవి కుండలములు - అర్ధనారీశ్వరతత్వము
వెనుక కుడి చేతిలో డమరుకం - శబ్దబ్రహ్మయొక్క ఉత్పత్తి
వెనుక ఎడమ చేతిలో అగ్ని - చరాచరముల శుద్ధి
ముందు కుడి చేయి - భక్తులకు అభయము
ముందు ఎడమ చేయి - జీవులకు ముక్తి హేతువయిన పైకి ఎత్తిన పాదమును సూచించును.
కుడి కాలుకింద ఉన్న అపస్మార పురుషుడు (ములయక రాక్షసుడు) - అఙ్ఞాన నాశనము
చక్రము - మాయ
చక్రమును స్పృశించిన చేయి - మాయను పవిత్రము చేయ్తుట
చక్రమునుండి లేచు 5 జ్వాలలు - సూక్ష్మమైన పంచతత్వములు

నాట్యం చేస్తున్నప్పుడు నటరాజుకు నాలుగు భుజాలు ఉంటాయి.ఆయన చేసే నృత్యాలు ఏడు రకాలుగా ఉంటాయి.
1) ఆనంద తాండవం
2) ప్రదోష నృత్యం ( సంధ్యా తాండవం)
3) కాళితాండవం
4) త్రిపురతాండవం
5) గౌరి తాండవం
6) సమ్హార తాండవం
7) ఉమా తాండవం

గౌరి ,ఉమా తాండవాలలో శివుని రూపం భైరవముగా ఉంటుంది. ఆయన సాత్విక నృత్యం ప్రదోషకాల నృత్యమే. అందుకే ప్రదోషకాలంలో శివపూజ ప్రశస్తమైనది.
అసలు భూలోకంలో ఉన్న నృత్యరూపాలు అన్ని ఆయన నృత్యంలో నుండి ఉద్భవించినవే!
ఆయన తన నృత్యమును,పార్వతి ద్వారా అభినయింప జేసి, తమ నాట్యాన్ని భరతమునికి చూపించగా,భరత ముని ద్వారా నాట్య వేదం రూపుదిద్దుకుందంటారు.
సమ్హారకరమైన శివుని ఉగ్రనృత్యములందు జగత్తును ప్రళయం గావించి,జీవుల కర్మబంధమును కూడా నశింపచేయును.
ఆనంద తాండవమునందు శివుని ముద్రల అంతార్ధము ఇదే. ఆయన తాండవము లోకరక్షాకరం.

Tuesday, 11 February 2014

దేవాలయ ప్రాశస్త్యం

దేహం దేవాలయం వంటిది. అందులో ప్రతిష్ఠమైన సనాతనుడైన జీవత్మాయే పరమాత్మా. విశ్వవ్యాప్తంగా వెలసియున్న దేవాలయాలన్నీ మానవ కల్యాణానికై ఏర్పాటు చేయబడినవే. అవి జాతి మాత కులభేదాలకు అతీతంగా నిర్మించబడ్డాయి. అది దేవాలయం, చర్చి, మసీదు, జైన మందిరం, మఠం మరేదైనా కావచ్చు. వాటి లక్ష్యం ఒక్కటే. మానవ మస్తిష్కంలోని దుష్టబుద్ధిని తొలగించి మానవత్వాన్ని పెంపొందిచడమే.

మానవుడంటే శారీరిక, మానసిక మహాశక్తులుగల వాడని నేటి శాస్త్ర విజ్ఞానం చెబుతోంది. కాని, తత్త్వం విచారిస్తూ చెప్పుకోవలసిన విషయం మరొక్కటుంది. దేవుడు సత్యం, శాంతం, దయ, జ్ఞానం, తృప్తి, త్యాగం మున్నగు మహానీయ గుణాలు గలవాడని అర్థం. వీటిని కలిగియున్న వాడే మహాత్ముడు. అట్టి సద్గుణ సంపత్తిని కలిగి ఉన్న కారణానే శ్రీషిరిడి సాయిబాబా, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీవివేకానంద మున్నగువారు మహాత్ములై భగవత్ గుణాలను కలిగి మానవులను ఆదర్శప్రాయులైయ్యారు.

పైన పేర్కొన్న గుణాలన్నీ మానవులలో కొరవడిన కారణం వల్లనే మానవులు దానవులై మారణహోమాన్ని సృస్తిస్తూ, మహోపద్రవకారకులుగా నేడు ప్రపంచాన్ని కుదిపెస్తున్నారు. పుట్టుక చేత మానవుడు మంచివాడే. పెరుగుదలలో క్రమంగా పరార్థాన్నివీడి స్వార్థాన్ని పెంచుకొని, సత్య, దయాశౌచాలకు తిలోదకాలిచ్చి, సాటి మానవులతో సహకరించిక నికృష్ట జీవితాన్ని గడుపుతున్నాడు. ఈవిధమైన మానవత్వ లేమి చేత ప్రపంచమంతా నేడు అశాంతికి గురౌతోంది.

దేవాలయాలు శాంతికి నిలయాలు కావాలి. అక్కడి ప్రశాంత వాతావరణం, ధర్మబోధ, మానవ మహోన్నతికి బీజం వేయాలి. వ్యక్తుల దురాలోచనలు వారి నుండి దూరం కావాలి. అవగుణాలను గురించి ఆలోచింపజేసి వాటి నిర్మూలనకు కృషి చేసేటట్లు చూడాలి. ఇట్టి ఆదర్శాలను చిత్తశుద్దితో దేవాలయాలు నిర్వహించగలిగినపుడు వాటి మనుగడ మహోన్నతమై ఉంటుంది. లేనినాడు వాటి ఉనికి నామమాత్రంగా మిగిలిపోతుంది.

నేటి దేవాలయాలు నిర్వాహణలో ఈ ప్రయత్నం ఏ మాత్రం సాగుతున్నదన్న విషయాన్ని ప్రతి దేవాలయ నిర్వాహకులు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరమెంతైనా వుంది.

దైవారాధనపూజ మానసికమైనదిగా మరియు ఆధ్యాత్మికమైనదిగా ఉంటోంది. వీటిని ఆర్భాటంగా నిర్వహించనక్కరలేదు. ఎవరో మనల్ని మెచ్చుకోవలేననిగాని, ఏంటో గొప్పగా నిర్వహింపబడిందని పేరు తెచ్చుకోవడానికి గాని చేయరాదు. అటువంటివి ప్రయోజన శూన్యాలు. భగవంతుడు అటువంటి డాంబిక, ఆరాధనా పూజాకార్యక్రమాలను ఆశీర్వదించడు అనడానికి తార్కాణమైనాకథా వృత్తాంతం గురువాయురులో జరిగిన కథ.

కేరళరాష్ట్రంలో నేటికీ ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ పుణ్యక్షేత్రం గురువాయూరు. అక్కడ వాసుదేవుడను శ్రీకృష్ణ భక్తుడు గలడు. నిరంతరం శ్రీకృష్ణుని సేవిస్తూ పూజా పురస్కారాలను మిక్కిలి ఆటోపంగా నిర్వహిస్తూ శ్రీకృష్ణుని సందర్శనానికి కాంక్షించుతున్నాడు.

ఒకరోజున భగవంతుని ప్రార్థిస్తూ తన కోర్కెను మన్నించి దివ్యసందర్శన భాగ్యాన్ని కలుగాజేయుమని వేడుకొని నిద్రించాడు. పరమాత్మ వాసుదేవుని భక్తిని పరీక్షించి కరుణింపదలచాడు. అతనికి స్వప్నంలో నేను నిన్నుఅనుగ్రహించడానికి రేపు మధ్యాహ్నం రానున్నాను అనే మాటలు వినిపించాయి.భక్తుని హృదయం ఉప్పొంగిపోయింది. అతనికి నిద్రపట్టలేదు. ఎలాగో రాత్రి గడిచింది. ఉదయాన్నేలేచి శుచియై శ్రీకృష్ణ విగ్రహాన్ని సుగంధ ద్రవ్యాన్ని కలిపినా స్వచ్చమైన జలంతో అభిషేకించాడు. పట్టుపీతాంబరాలను కట్టబెట్టాడు. పరిమళాన్ని వెదజల్లు పుష్పాలతో అలంకరించాడు. మిక్కిలి కాంతివంతమగు దీపాలను వెలిగించాడు. అగరువత్తులను వెలిగించి ధూపం వేశాడు. చందన, కర్పూర సువాసనలను గుబాళింపచేశాడు. షడ్రుచులతో కూడిన ఆహారపదార్థాలను పంచభక్ష్య పరమాన్నాలను సిద్ధపరిచాడు.

మేళతాళాల రణగోణధ్వనులు ఉత్సవస్ఫూర్తినిస్తున్నాయి. పూజా పురస్కారాలను మిక్కిలి ఆడంబరంగా నిర్వహించాడు. కార్యక్రమమంతా పూర్తియైనది. ఇక భగవంతుని రాక నైవేద్య సమర్పణ మిగిలి ఉంది. శ్రీస్వామివారు చెప్పిన సమయమాసన్నమైనది. భక్తునిలో ఉత్కంట పెరిగింది. చుట్టూ చేరిన జనసందోహం మిక్కిలి ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

ఇంతలో అచ్చటికి ఒక వృద్ధుడు కర్రచేతపట్టుకొని, నడుంవంగిపోయి పొట్ట వెన్నమొక అంటుకొనియుండగా, కాళ్ళు తడబడుచుండగా, ఆకలితో ఆర్తనాదం చేయుచూ మెల్లగా నడిచి వచ్చి భిక్షాన్నమడిగాడు. తానూ ఎదురుచూచుచున్న శ్రీకృష్ణుడు రాకపోగా, ఈ ముదుసలి వచ్చి శ్రీక్రుష్ణునికై ఏర్పాటు చేయబడిన నైవేద్యాన్ని ఆహారంగా అడిగి వాతావరణాన్ని భంగపరిచాడని వాసుదేవ భక్తునికి అసహనమేర్పడింది. కోపంతో మంచి చెడ్డలాలోచించక శ్రీకృష్ణవిగ్రహం వద్ద నున్న దండాన్ని తీసికొని వృద్ధునిపై విసిరాడు. ఆ దండమతనికి నడుంకి గట్టిగా తగులటం వలన నడుం విరిగి కుప్పకూలిపోయాడు. జనసందోహం తన చుట్టుముట్టినంతలో అతడంతర్హిడయ్యారు. జరిగిన అపరాధానికి మిక్కిలి చింతిస్తూ వాసుదేవుడు శ్రీకృష్ణుని విగ్రహంచెంత తలవాల్చాడు. విగ్రహం నడుం కూడా విరిగి క్రింద బదియున్నది. ఎంత వింత దృశ్యం? ఆ దృశ్యం నుండి వినిపించిన పల్కులివి, “వాసుదేవా! ఎంతోకాలంనుండి నారాకకై ఎదురుచూస్తున్నావు. నేను రాగానే నిర్దయుడవై కర్ర విసిరి నాకు దూరమైతివి. దైవం మానవరూపం అన్న విషయం నీకు తెలియదా! అందరియందున్నభగవదాత్మ ఒక్కటేయని నేను భగవద్గీతలో ప్రవచించలేదా? విగ్రహారాధనకు ప్రాధాన్యమిచ్చి ప్రాణమున్న మనుష్యుని హింసించావు. దయగల హృదయమే భాగవన్నిలయం. ఇకమీదట మానవత్వ లక్షణాలను పెంపొందించుకొని దైవత్వంను పొందుమని ఆశీర్వదించాడు. వాసుదేవుడు తన తప్పిదాన్ని తెలుసుకొని మానవ సేవలో తన శేషజీవితాన్ని గడిపి శ్రీకృష్ణ సాయున్యమును పొందాడు. ఈ కథను తెలుసుకొన్న తరువాత ఆరాధనా పూజాకార్యక్రమాలు మానసికమై ఉంది సాటి మానవులపై కరుణాదృష్తి కల్గియుండవలెనని తెలుస్తోంది గదా!

దేవాలయ ప్రాంగణంలో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం ఉంటుంది. భగవంతునిసేవలో కొంత సేదదీరుతాము. తాము చేస్తున్న పనులు సరియైనవా, కావా అని ఆత్మవిమర్శ చేసుకునే వీలవుతుంది. భగవదారాధన చేస్తూ అసత్య దోషాలను అసంబద్ధ కార్యకలాపాలను నిర్వహించడానికి మనసులో జంకుకల్గుతుంది. సాతివారితో మీలాగే తీరు చాల సవ్యంగా ఉంటుంది. తన కష్టాలను భగవంతునికి విన్నవించుకొని భక్తిభావమును పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కారణాల వలన ఉదాత్తమైన వ్యక్తిత్వము పెంపొందుతుంది.

భగవదారాధకులకు కష్టాలు రావా? వారంతా సుఖంగా ఉనారా? వీటికి సమాధానం బాహుళ్యమైనది. త్యాగయ్య, పోతన్న, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణమహర్షి, నందనారు, కబీరు మున్నగు వారంతా గొప్ప భక్తులు. వారు సైతం అనేక కష్టాలకు గురైయ్యారు. అయినప్పటికీ వారికి వచ్చిన ప్రమాదం లేదు. వారు భగవంతుని సేవలో కృతకృత్యులై అవ్యాజానందాన్ని పొంది మోక్షప్రాప్తిని పొందారు. కొన్ని సందర్భాలలో కష్టాలు వారి వారి సమార్త్యాలను, సాధారణంగా పురాకృత కర్మల వలన వస్తుంటాయి. సామర్థాన్ని పెంచుకొని సత్కర్మలను ఆచరించటం వలన కష్టాలను ఎదుర్కోడానికి శక్తి, నివారణానికిమార్గాలు లభిస్తాయి. భగవంతుని నమ్ముకుని సేవించువాడు తనకు ఎదురయ్యే ఆతుపోట్లును తట్టుకొని దైన్యాన్ని వీడి, ధైర్యమును తెచ్చుకొని, భగవదారాదనలో శాంతిని పొంది స్థిత ప్రజ్ఞుడవుతాడు.

ధరఖర్వాతుడోకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుడై

త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ తాళద్రుమచ్చాయత

చ్చిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్దయోగంబుగా

బోరిదైవోపహతుండు పోవుకడకున్ పోవుంగదా యాపదాల్.

“బట్టతలవాడొకడు ఎండ వేడిమికి తట్టుకొనలేక ఏ చెట్టూ లేని కారణాన, తాటిచెట్టు కన్పించగా, పరుగు పరుగున వెళ్ళి దాని క్రింద నీడకై నిలుచున్నాడు. అదే సమయంలో ఆ తాటిచెట్టు నుండి తాటిపండు అతని తలపై పడటం వలన తల పగిలింది. దైవానుగ్రహం లేని వానికే అలా ఆపదలు సంభవిస్తున్నాయి” అని అన్నారు.

దీనినిబట్టి దైవోపహతుడెట్టి కార్యం చేయబోయినా ఫలించక ప్రమాదం సంభవిస్తుందనడం అనుభవైకవేద్యం. చాలామంది తాము భగవదారాధకులమని, తమ కష్టాలు తీరటంలేదని, తమ పూజలు ఫలించటం లేదని చెబుతుంటారు. ఈ అనుభవం కూడా సత్యమైనదే.

మన ప్రార్ధనలకు సమాధానం రాలేదు. కోర్కెలు సఫలము కాలేదు. మనశ్శాంతి కలగటం లేదు. కారణమేమిటి? ప్రార్ధనలో నిశ్చలత్వం అవసరం. అది సంసార బంధాల నుండి విముక్తి కొరకుగానుండుట సమంజసం. ప్రార్ధన లేదా పూజలో నా మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది? నిస్సంగత్వే నిశ్చలత్వత్త్వమని జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి బోధన.

కోర్కెలు ఇహలోక సౌఖ్యాల కొరకు మాత్రం పరిమితం గాక జన్మ రాహిత్యాన్ని కోరునట్టివై ఉండటం కూడా ముఖ్యం. పరహితం లేని కోర్కెలు ఫలించవు. ధర్మాన్ని విడిచి ఏ పని జేసినా అది వ్యర్థమే. పరమధర్మాన్నే మహాభారతంలో వివరించిన తీరును గురించి తెలుసుకొందాం.

ఒరులేయవి యొనరించిన
నరవర అప్రియము తన మనంబున కగు తా
నొరులకవి యొనరించకునికి
పరాయణము పరమధర్మ పతమండ్రు జనుల్.

ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టముండదో అట్టి దానిని నీవు ఇతరులకు చేయకుండుటయే పరమధర్మమని భావం. ఇంతకన్నా మహోదాత్తమైన విషయమేమి ఉంటుంది? మానవత్వం ఈ పద్యంలో వెల్లివిరియటం లేదా దానిని ఆచరణలో పెట్టగలిగినవాడు మానవుడు ఇలలోనే మహానుభావుడవుతాడు కదా!

భౌతిక సంబంధమైన వాంఛలను విడనాడి, తనకు భగవంతుడిచ్చిన ఆయుర్దాయ కాలాన్ని సద్వినియోగం చేసికొంటూ, జాతస్య మరణం ధృవ మను సత్యాన్ని మరువక, మానవ విధులను సక్రమంగా నిర్వహించి వైరాగ్య భావంతో యోగాభ్యాసాన్ని అవలంబించి తద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేసిన అదే నిర్వాణపథం. జీవబ్రహ్మైక్య రహస్యం కూడ. అప్పుడు మానసికస్థితి నిశ్చలముగ ఉండి మానవుడు ఋషితుల్యుడవుతాడు. జీవిత పరమార్ధాన్ని సాధించిన మానవుడే మహాత్ముడైన భగవంతుడి రూపం.

మనలో ధర్మభావమును నింపడానికి ప్రతిగ్రామంలో, ప్రతీ పట్టణంలో మన పెద్దలు దేవాలయాలను నిర్మించారు. వేదవిదులు, త్రికాలవేత్తలు అయిన మహాఋషులు, విశ్వశాంతికై, సర్వజన ఆత్మోద్ధరనకై, మహిమాన్వితాలైన దేవాలయాలను స్థాపించి, నిత్య సత్య జ్ఞానమర్గాన్ని విశ్వశాంతికి ప్రచారం చేయడానికి దోహదం చేసారు. నిత్యం దేవాలయదర్శనాన్ని చేసుకునేవారు, గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లు, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేనివాడై, వాటి పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు.

పురాణాలు

పురాణం

"పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి. 

పురాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి. ఇక కథలైతే...భారతీయ సాహిత్యంలోని ప్రాచీన గ్రంధాలన్నిటికీ పురాణ గాధలే ఆధారం. మన తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధ ప్రబంధాలన్నీ పురాణాలలోంచే ముడి సరుకుని తీసుకున్నాయి. అల్లసాని పెద్దన మనుచరిత్రకు మార్కండేయ పురాణంలోని కథ ఆధారం. తెనాలి రామక్రుష్ణుడు తన పాండురంగ మహాత్యానికి స్కాంద పురాణమే ఆధారమన్నాడు. రాయల వారు అముక్తమాల్యదలోని కొన్ని కథలను విష్ణు పురాణం నుంచి తీసుకున్నాడు. 

మానవ జీవితానికి కావలసిన శాస్త్ర విషయాలను పురాణాలలో మన ఆదిమ ఋషులు చేర్చేవారు. ఋషి ప్రోక్తాలు కాబట్టే పురాణాలను కూడా వేదాలలాగే ప్రమాణద్రుష్టితో చూసేవారు. నిజానికి మనకు వేదకాలంలో కూడా పురాణ సాహిత్యం ఉంది. అధర్వ వేదం పురాణాన్ని పేర్కొంది. ఉపనిషత్తులు కూడా పురాణ ప్రాముఖ్యాన్ని శ్లాఘించాయి. వేద కాలం నాటి పురాణ సమ్హితలో 4 వేల శ్లోకాలు మాత్రమే ఉండేవి. అవి నేటికి పెరిగీ పెరిగీ కొన్ని లక్షల స్లోకాలుగా పరిణామం చెందాయి. 18 మహా పురాణాలలోని శ్లోకాలు 4,11,000 అని లెక్కతేలుతున్నాయి. ఉప పురాణాల శ్లోక సంఖ్య అంచనా కట్టడం ఎప్పటికీ సాధ్యం కాదు. 

సిద్ధాంతాల ఘాటునుబట్టి పురాణాలను సాత్విక, తామస, రాజస పురాణాలని 3 గుణాలవారీగా వర్గీకరించవచ్చు. పురాణంలోని ప్రతి ఒక్క కథకూ ఫలశ్రుతి చెప్పారు. ఫలానా ఫలం కావాలంటే ఫలానా నోము నోచమన్నారు. ప్రతి పురాణాన్నీ వ్యాసుడు వ్రాస్తే దాన్ని సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహా మునులకు చెప్పాడు. అయితే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కల్పంలో పుడుతుంది. కల్పమంటే బ్రహ్మ దినం. 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మకల్పం అన్నమాట. 

విశ్వము యొక్క సృష్టి స్ధితి లయములు, రాజవంశములు మున్నగు వాని చరిత్రములను పురాణములు వివరించును. మరియు భగవంతు డొనర్చు దుష్ట శిక్షణ - శిష్ట రక్షణములను, మనుజులు పాటింపవలసిన ధర్మములను, ఆధ్యాత్మిక సాధనలను పురాణములు ప్రబోధించుచున్నవి. పవిత్ర క్షేత్రములు, తీర్ధస్ధలములు మున్నగువాని మహత్యములను గూడ పురాణములలో వర్ణింపబడినవి. 

శబ్దప్రధానములైన వేదములు ఏ విషయములను ప్రభువువలె శాసించునో ఆ విషయములనే అర్ధ ప్రధానములైన పురాణములు మిత్రుని వలె కథలద్వారా మనకు తెలియపరచును. అందువలన హిందూ సాహిత్యములో పురాణములు మిక్కిలి ప్రధానములై యున్నవి.

అష్టాదశ పురాణాలు:
మత్స్య పురాణము
మార్కండేయ పురాణము
భాగవత పురాణము
భవిష్య పురాణము
బ్రహ్మ పురాణము
బ్రహ్మాండ పురాణము
బ్రహ్మ వైవర్త పురాణము
వరాహ పురాణము
వామన పురాణము
వాయు పురాణము
విష్ణు పురాణము
అగ్ని పురాణము
నారద పురాణము
స్కంద పురాణము
లింగ పురాణము
గరుడ పురాణము
కూర్మ పురాణము
పద్మ పురాణము

1.మత్స్య పురాణము
దీనిలో 1400 శ్లోకములున్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువునకు బోధింపబడినది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యులు చెప్పబడినవి.

2.మార్కండేయ పురాణము
ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహాత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు మరియు సప్తశతి (లేక దేవీ మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హొమము, శతచండీ, సహస్ర చండీ హొమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తశతియే.

3.భాగవత పురాణము
దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుక్రునకు, శుక్రుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు శ్రీకృష్ణ జనన, లీలాచరితాలు వివరింపబడినవి.

4.భవిష్య పురాణము
దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.

5.బ్రహ్మపురాణము
దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ - నరకాలను గూర్చి వివరించబడినవి.

6.బ్రహ్మండ పురాణము
దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.

7.బ్రహ్మ వైవర్త పురాణము
దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడింది.

8.వరాహ పురాణము
దీనిలో 24,000 శ్లోకములు. వరాహ అవతార మెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు. పుణ్యక్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.

9.వామన పురాణము
దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము - ఋతు వర్ణనలు వివరించబడినవి.

10. వాయు పురాణము
దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.

11. విష్ణు పురాణము
ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహత్మ్యము, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.

12. అగ్ని పురాణము
దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్టునకు శివ, గణేశ, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.

13. నారద పురాణము
ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మమానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము(శివస్తోత్రము) ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.

14.స్కంద పురాణము
దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు)చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహ్మొత్తర ఖండము (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహకాల మహత్మ్యము) మొదలగునవి కలవు.

15.లింగ పురాణము
ఇది శివుని ఉపదేశములు, లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతోపాటు వ్రతములు. ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.

16.గరుడ పురాణము
ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహవిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ - నరక ప్రయాణములు తెలుపబడినది.

17.కూర్మ పురాణము
ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ, నరసింహావతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయాగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.

18.పద్మపురాణము
ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది పద్మపురాణము. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటభవధ, బ్రహ్మసృష్టికార్యము, గీతార్ధసారం - పఠనమహత్మ్యం, గంగామహత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివృక్షమహిమ, విభూతి మహత్మ్యం, పూజావిధులు - విధానం, భగవంతుని సన్నిధిలో ఏవిధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలుయజేయబడింది.

నదుల ప్రాశస్త్యము

భారతదేశం ఎన్నో పుణ్యనదులు, తీర్ధాలకు నిలయం. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో స్నానమాచరిస్తే అనంత పుణ్యాన్ని, అత్మతత్వాన్ని ప్రసాదింపజేసి పునర్జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి.
భారతదేశం ఖండాంతరాల్లో పెరుగాదించడానికి మూలకారణం ఈ దేశం యొక్క నగ-నన-నదీ-తీర్థ కలయికతో గూడిన ప్రకృతి.
ఋగ్వేదంలో నదుల మహిమల గురించి ఇలా చెప్పారు. “గంగానదీ తీరమున దానం చేయటంవల్ల మానవుడు పరితాత్ముడౌతాడు. సరస్వతీ మొదలగు ప్రఖ్యాతాలైన పుణ్యనదీతీరముల యందు యజ్ఞాది వైదికకర్మలను ఆచరించుట చాలా మంచిది. సరస్వతీనది శ్రేష్ఠమైన తల్లిగా సంబోధింపబడింది".
నదిలో కొన్ని పవిత్ర స్థలాలున్నాయి. తైత్తిరీయ సంహిత ఇలా చెప్పింది -
తీర్థే, స్నాయి తీర్థమేవ సమానానాంభవతి
నదులన్నీ దైవతాలుగా ప్రస్తావింపబడ్డాయి. సరస్వతీ నది సర్వోత్తమమైన నదీదేవత.
మన దైనందినజీవితంలో శ్రౌత, స్మార్తాది కర్మలలోని కలశారాధనలో నదులపేర్లను ఈ విధంగా స్మరిస్తాం.
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి,
నర్మదే సింధు కావేరి, జలే స్మిన్ సన్నిధం కురు ||
“దివ్యములైన ఈ జలాలు మంగళకరాలైన మా అభీష్టమును తీర్చుగాక! మాకు త్రాగుటకు అనువైన నీటిని ఇచ్చుగాక! మావైపు ప్రవహించు గాక!” ఇవి జలవైశిష్ట్యాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకున్న వేదఋషులు త్రికరణశుద్ధిగా జలదేవతను ప్రార్థించిన మంత్రం యొక్క భావం.
ఇంటిలో స్నానం చేస్తున్నా కూడా “గంగేచ యమునే కృష్ణేగోదావరి సరస్వతి" అంటూ ఆ నదులను స్మరిస్తూ చేసే స్నానం వల్ల వచ్చే ఫలాలను అర్షులు ఇలా చెప్పారు.
నదీస్నానం చేస్తే శారీరకంగా కనబడే మాలిన్యం పోతుంది.
నిండు ప్రవాహమున్ననదిలో స్నానం చేయడంవల్ల శరీర మంతటికీ సుఖస్పర్శ కలిగి శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది.
నడీనీటిలోని చల్లదనం ఇంద్రియతాపాలను తగ్గించి మనస్సుకూ, వాక్కుకూ శుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధిస్తుంది.
పుణ్యనదీతీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతనిస్తుంది.
తీర్థమందు స్నానం చేసినవాడు తనకు సంబంధించిన వారిలో చాలా శ్రేష్ఠమైన వాడవుతాడు.
మహర్షుల యొక్క దీక్షా, తపస్సుల విశేషాలు, శక్తి నదీ జలాల్లో ఉన్నవని వేదం నిర్దేశించింది. కావున నదీస్నానంచే వాటిని మనము స్వీకరించి పవిత్రులమౌతాం.
అందుచేతే నదీజల స్నానం సర్వథా, సర్వదా యోగ్యమని అర్షుల వాక్కు.
భారతదేశంలో పుణ్యనదులకు కొరతేలేదు. పుట్టింది మొదలు మానవులు చేసే పాపాలు విశిష్టదినాల్లో అనగా – పుష్కర సమయంలో, గ్రహణ సమయాల్లోను, మకర సంక్రమణ సమయంలో, కార్తీక, మాఘమాసాల్లో నదీ స్నాన మాచారిస్తే త్రికరణశుద్ధిగా పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి.
గంగానదీ స్నానం అరవైయోజనాల పవిత్ర ప్రదేశం. అరవై పాపాలు హరించే పుణ్యమూర్తి. గంగాద్వారా స్నానఫలం దీనికి రెట్టింపు.
యమునానదీ తీరం ఇరువది యోజనాలు విస్తరించి, ఇరవై రకాల పాపాలు పరిహరిస్తుంది.
సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి ఇరవైనాలుగు యోజనాలు విస్తరించిన ఈ నది ఇరవై పాపాలు పోగొడుతుంది.
వరుణ, కుశావర్త; శతద్రువు; విపాశక; శరావతి; వితస్త; ఆశిక్ని; మధుమతి; ఘ్రుతవతి; మొదలిఅన నదీతీరాల్ సందర్శనం శుభప్రదం. దేవనడిగా ప్రఖ్యాతమైన ఆ నదీ పరీవాహక ప్రాంతం పదియోజనాలు విస్తరించి; పదిహేను రకాల పాపాలను పోగొడుతుంది. రేవానదీ స్నానం బ్రహ్మ హత్యాపాతకాన్ని నాశనం చేస్తుంది. చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, కౌశిక, మందాకినీ, సహస్త్రవక్ర్త, పూర్ణ, పుణ్య, బాహుదాలనే నదులు పదహారు యోజనాలు విస్తరించాయి. నదీ సంగమ ప్రదేశాల్లో చేసే స్నానం, సంధ్యాదికాలు అనంత పుణ్యఫలాలనిస్తాయి.
గోదావరీతీరం ఆరు యోజనాలు విస్తరించి ఉంది. ఒక్కసారి గోదావరి తీరం చుట్టి వచ్చినవారికి “వాజపేయ” యాగ ఫలం లభిస్తుంది.
భీమేశ్వరం, వంజర సంగమస్థానాలు ప్రయాగాతో సమానం. ద్వాదశ యోజనాలు విస్తరించిన కుశస్థలీనది ముప్ఫై ఆరు పాపాలను, పూర్ణానది యాత్ర ముప్ఫై పాపాలను, కృష్ణవేణి పదిహేను పాపాలను, తుంగభద్ర ఇరవైపాపాలను ప్రక్షాలనం చేస్తాయి.
పంపాసరోవర శక్తి అనంతం. పాండురంగా మాతులింగ, గంధర్వ నగరాలు తీర్థాలతో విలసిల్లుతున్నాయి. రామేశ్వరంలో 108 తీర్థాలు, ఆదివరాహక్షేత్రమైన తిరుమలలో దాదాపు 18 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం కలుగుతుంది.
మహానది, తామ్రపర్ణి నదుల పుణ్యం వర్ణశక్యముకాదు. కుంభకోణంలో స్నానం సమస్త తీర్థాల సమానం.
కొన్ని సమయాల్లో నదులు, తీర్థాలలో స్నానమాచరించటం నిషేధించటం జరిగింది. రవి కర్కాటకంలో ఉన్న సంక్రమణ సమయం రెండుమాసాలు నదీ రజస్వల సమయం. ఆ సమయంలో నదీస్నానం దోషం. నదీ తీరప్రాంత వాసులకు ఈ దోషముండదు.
నదీ రజస్వల అంటే, కొత్తనీరు రావటమన్న మాట. అప్పుడు స్నానం చేయడం, మహాదోషం. తీర్థసేవన విషయంలో ఇది సాధారణ విషయమైనా, ఈ సమయంలో తీర్థ దర్శనం చేయవలసివస్తే స్నాన, క్షౌర, ఉపవాసాదులు ఆచరించాలి. కాబట్టి “జాగ్రత్త" అని హెచ్చరించారు.
ప్రతి నదీ పాపహారిణే, పుణ్యమూర్తే. నది స్త్రీ రూపం. అందుకే స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులతో విశేషంగా నదిని పూజిస్తారు.
ప్రతి జీవనడికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత చెప్పటం పుష్కరాల ప్రధానోద్దేశం. పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృఋణం తీర్చుకోవటం ఒక ధార్మిక, సాంస్కృతిక ప్రయోజనం.
మేషం మొదలైన పన్నెండు రాశులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం ఉంటాడు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినపుడు కృష్ణానదికీ పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో నదీస్నానం చేస్తే వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.

EkaDashi - ఏకాదశి

ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమావాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .

ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. 
ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .

దేవదానవులు ఈ ఏకాదశిరోజు ఉపవాసంతో రాత్రింబవళ్లూ శ్రమించి, క్షీరసాగరాన్ని మథించగా, ద్వాదశినాడు మహాలక్ష్మి సముద్రంనుండి వెలువడి వచ్చి, దేవతలకు ప్రత్యక్షమై, వారిని అనుగ్రహించింది. నాటినుండి ఏకాదశి నాడు పగలూ, రాత్రి ఉపవాసంతో ఉండి. జాగరణ చేసి, శ్రీహరిని స్తుతించిన వారికి స్వామి కృపవల్ల ముక్తి కరతలామలకమవుతుందనే నమ్మకం ఏర్పడింది.

శుక్ల ఏకాదశినాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది. బహుళ ఏకాదశినాడు చంద్ర మండలం నుండి పదకొండవ కళ సూర్యమండలాన్ని చేరుతుంది. ఇలా రాకపోకలవల్లనే "ఏకదశి" అనే పేరు సార్థకమవుతుంది.

"ఏకాదశ్యాముపవసేన్న కదాచి దతిక్రమేత్" - ఏకాదశినాడు తప్పక ఉపవాసం చేయాలి. ఉపవాసంనాడు - ఉపవాసః స విఙ్ఞేయః సర్వభోగ వివర్జితః" - పాపకృత్యాలకు దూరంగా ఉండి (చేయక), సకల భోగాలను వదలి, పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం అని పెద్దలమాట! ఇంద్రియ ప్రకోపాన్ని అణచి, 11 ఇంద్రియాలను (పంచ కర్మేంద్రియ, పంచ ఙ్ఞానేంద్రియ మనస్సులు 11 ఇంద్రియాలు) భగవంతుని సన్నిధిలో వసింపజేసేదే నిజమైన ఉపవాసం. ఏకాదశీవ్రతం దశమి రాత్రితో ప్రారంభమై, ద్వాదశి ఉదయంతో పూర్తి అవుతుంది. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు!

24 ఏకాదశుల పేర్లూ, ఫలాలు, సంగ్రహంగా:

(01) చైత్ర శుక్ల ఏకాదశి - 'కామదా' - కోర్కెలు తీరుస్తుంది.
(02) చైత్ర బహుళ ఏకాదశి - 'వరూధిని' - సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.
(03) వైశాఖ శుద్ధ ఏకాదశి - 'మోహిని' - దరిద్రుడు ధనవంతుడగును.
(04) వైశాఖ బహుళ ఏకాదశి - 'అపరా' - రాజ్య ప్రాప్తి.
(05) జ్యేష్ఠ శుక్ల ఏకాదశి - 'నిర్జల' - ఆహార సమ్రుద్ధి.
(06) జ్యేష్ఠ బహుళ ఏకాదశి - 'యోగినీ' - పాపాలను హరిస్తుంది.
(07) ఆషాఢ శుద్ధ ఏకాదశి - 'దేవశయనీ' - సంపత్ ప్రాప్తి (విష్ణువు యోగ నిద్రకు శయనించు రోజు).
(08) ఆషాఢ బహుళ ఏకాదశి - 'కామికా' - కోరిన కోర్కెలు ఫలిస్తాయి.
(09) శ్రావణ శుక్ల ఏకాదశి - 'పుత్రదా' - సత్ సంతాన ప్రాప్తి.
(10) శ్రావణ బహుళ ఏకాదశి - 'అజా' - రాజ్యపత్నీ-పుత్ర ప్రాప్తి. ఆపన్నివారణం.
(11) భాద్రపద శుద్ధ ఏకాదశి - 'పరివర్తన' - (యోగనిద్రలో విష్ణువు ప్రక్కకు పొర్లును కనుక పరివర్తన) యోగసిద్ధి.
(12) భాద్రపద బహుళ ఏకాదశి - 'ఇందిరా' - సంపదలు, రాజ్యము ప్రాప్తించును.
(13) ఆశ్వయుజ శుక్ల ఏకాదశి - 'పాపాంకుశ' - పుణ్యప్రదం.
(14) ఆశ్వయుజ బహుళ ఏకాదశి - 'రమా' - స్వర్గప్రాప్తి.
(15) కార్తిక శుక్ల ఏకాదశి - 'ప్రబోధిని' - (యోగనిద్ర నొందిన మహా విష్ణువు మేల్కొనే రోజు) ఙ్ఞానసిద్ధి.
(16) కార్తిక క్రుష్ణ ఏకాదశి - 'ఉత్పత్తి' - దుష్ట సంహారం. (మురాసురుణ్ణి సంహరించిన కన్య విష్ణు శరీరం నుండి జనించిన రోజు).
(17) మార్గశిర శుక్ల ఏకాదశి - 'మోక్షదా' - మోక్ష ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
(18) మార్గశిర క్రుష్ణ ఏకాదశి - విమలా' (సఫలా) - అఙ్ఞాన నివ్రుత్తి.
(19) పుష్య శుక్ల ఏకాదశి - 'పుత్రదా' - పుత్ర ప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).
(20) పుష్య క్రుష్ణ ఏకాదశి - 'కల్యాణీ' (షట్ తిలా) - ఈతి బాధా నివారణం.
(21) మాఘ శుక్ల ఏకాదశి - 'కామదా' (జయా) - శాప విముక్తి.
(22) మాఘ క్రుష్ణ ఏకాదశి - 'విజయా' - సకల కార్య విజయం (ఇది భీష్మైకాదశి అని ప్రసిద్ధి).
(23) ఫాల్గున శుక్ల ఏకాదశి - 'అమలకీ' - ఆరోగ్యప్రదం.
(24) ఫాల్గున క్రుష్ణ ఏకాదశి - 'సౌమ్యా' - పాప విముక్తి.

పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని భేదాలు కన్పిస్తున్నాయి.

ఏకాదశీదేవి జననం: 

పూర్వం క్రుతయుగంలో చంద్రావతీ నగరాన్ని పాలించే 'మురు' అనే రాక్షసడు ఉండేవాడు. దేవతల్ని జయించి, వేధించేవాడు. విష్ణువు వానితో వెయ్యేండ్లు యుద్ధంచేసి, అలసి, విశ్రాంతికై ఒక గుహలో చేరి, నిద్రించినాడు. అట్టి శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా, స్వామి శరీరంనుండి దివ్య తేజస్సులతో ఒక కన్య ఉద్భవించి, దివ్యాస్త్రాలతో యుద్ధంచేసి మురుణ్ణి సంహరించింది. విష్ణువు మేల్కొని, కన్యనూ, మరణించియున్న మురుణ్ణీ చూచి, ఆశ్చర్యపడినాడు. కన్య నమస్కరించి, జరిగినదంతా విన్నవించింది. సంతోషించిన విష్ణువు ఆమెను వరం కోరుకోమన్నాడు. ఆమే ఆనందంతో "దేవా! నేను ఏకాదశినాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక నా పేరు ఏకాదశి. నా వ్రతం చేస్తూ, ఈనాడు ఉపవాసం ఉండేవారు సంసార బంధాలనుంచీ తరించేటట్లుగా వరమిచ్చి అనుగ్రహించండి" అని ప్రార్థించింది. స్వామి "అట్లే అగుగాక" అని వరమిచ్చి అద్రుశ్యుడైనాడు. నాటినుండి ఏకాదశీవ్రతం భక్తితో ఆచరించేవారు సకలపాపాలనుండి విముక్తులై, విష్ణు లోకాన్ని పొందుతారనే ప్రశస్తి ఏర్పడింది.

ఏకాదశీ తిథికి అధిదేవత ఏకాదశీదేవి. ఈమె విష్ణు దేహసముత్పన్న కనుక శ్త్రీమూర్తియైన మహావిష్ణువే!

సర్వోత్తమ తిథి ఏకాదశి: 

కుచేలుడు ఏకాదశీవ్రతాన్ని ఆచరించి మహైస్వర్యవంతుడైనాడని, ధర్మరాజు ఆచరించి కష్టాలనుండి గట్టెక్కినాడని, రుక్మాంగదుడు ఆచరించి పుత్రప్రాప్తి నొంది, దేవతాక్రుపకు పాత్రుడై, మోక్షగామి అయినాడని, క్షీరసాగర మథనం, లక్ష్మీ ఆవిర్భావం ఏకాదశినాడే జరిగాయని, వైఖానస రాజు ఆచరించి పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి చేకూర్చాడని పురాణ ఉవాచ. అంబరీషు వ్రత ప్రభావం జగద్విదితం!

Thursday, 6 February 2014

Pooja vidhanam

ఉదయం లేవగానే - 

కరదర్శనం :-
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి 
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం ||

చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను. 

లేదా

మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను)

భూప్రార్ధన :- 
సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే 
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే ||

పాదస్పర్శతో భూదేవిని బాధిస్తున్నందుకు క్షమాపణ చెప్తూ కాలిని నేలకు ఆన్చాలి. 
లేదా 

పాదస్పర్శ క్షమస్వమే, భూదేవి నమోస్తుతే ||

అనైన ప్రార్ధించవచ్చును

ప్రాతః స్మరణ :-
బ్రహ్మ మురారి స్త్రిపురాంతకశ్చ, భాను శ్శశీ భూమిసుతో బుధశ్చ 
గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః, కుర్వంతం సర్వే మమ సుప్రభాతమ్ ||

త్రిమూర్తులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు నాకు మేలు చేయుదురుగాక! 

లేదా 

హరం హరిం హరిశ్చంద్రం హనూమంతం హలాయుధమ్ 
పంచకం వై స్మరేన్నిత్యం ఘోరసంకటనాశనమ్ ||

స్నాన విధి :- 
గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ||

లేదా 

యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః 
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః ||

భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ 
మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ ||

బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి.

ఆత్మను పరమాత్మలో లయం చేయడానికి మన పూజావిధానం ఒక ఉతమోత్తమ మార్గం. దేవుని విగ్రహం లేదా చిత్రం విశ్వాత్మకు ప్రతిబింబం. విగ్రహం భూతత్వమైనది. అలానేసాంబ్రాణి ధూపం భూతత్వమైన వాసన కల్గివుంటుంది. ఇవి మూలాధారచక్రమును ఉత్తేజితం చేస్తుంది. అలానే తీర్ధ ప్రసాదాలు రుచి ద్వారా స్వాదిష్టానాన్ని ఉత్తేజితం చేస్తుంది. దీపం, హారతి ద్వారా జనించిన అగ్ని మణిపూరచక్రమును, గంధం, అగరబత్తిల ద్వారా వాయుతత్వమైన అనాహతచక్రమును, గంటానాదం ద్వారా విశుద్ధిచక్రం ఉత్తేజితం అవుతాయి. తద్వారా ఆజ్ఞాచక్రం, సహస్రారం జాగృతం అవుతాయి. ఇట్లా మనలోని నాడీకేంద్రాలను జాగృతం చేసుకోవడానికి పూజావిధానాన్ని ప్రాచీన మహర్షులు మనకందించారు. మంత్రాలు, ప్రార్ధనలు, సంకీర్తనలు, అర్చనలు, పూజలు ద్వారా మన షట్చక్రాలను మేలుకొల్పి కుండలినీశక్తిని పైకి నడిపి సహస్రారంలో గల పరమాత్మతత్వాన్ని ఆరాదిస్తున్నాం.

పూజావిధం :-
 చిత్రం, మృత్తిక, శిల, దారువు, లోహం.... దేనితో తయారైనదైనా దానిని భగవంతుని ప్రతిరూపముగా భావించి పూజిస్తాం. [ఈ రూపాలు మన ప్రగాడ విశ్వాసభావనతో ఏర్పరుచుకున్నవి]

న తే రూపం న చాకారో నాయుధాని న చాన్పదమ్ 
తధ్కాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశాసే  ||

భగవంతునికి ప్రత్యేకముగా ఒక్క రూపముగాని, ఒక్క ఆకారముగాని, ఆయుధముగాని (శంఖు,చక్ర,డమరు మొదలగు), వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగాని లేనప్పటికిని భక్తవత్సలగుటచేతను, పరమకరుణాస్వరూపులగుటచేతను భక్తులయొక్క భావమును అనుసరించి అనేకరూపములను ధరించుచున్నారు. 

యే యధా మాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం ..... ఎవరు ఎలాంటి భావముతో నన్ను ఉపాసింతురో వారికాలాంటి భావముతో దర్శనమిత్తును. 

దీపస్తుతి :-
దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ 
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే 

దీపజ్యోతే పరబ్రహ్మం. దీపజ్యోతే అన్ని తమో గుణాలని హరించేది. దీపం వల్లే సర్వం సాధ్యం. సంధ్యలో వెలిగే దీపానికి నమస్కారాలు. [దీపకాంతిలో తమోరజో గుణాలు హరిస్తాయి]

నమస్కారం :-
 పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః 
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల  ||

తలవంచి రెండు చేతులు జోడించి హృదయం వద్దగానీ, భ్రూమధ్యంలో గానీ, నెత్తి పై అంటే సహస్రారంపై గానీ పెట్టి నమస్కరించడానికి కారణం ఏమిటంటే - మూడు ప్రదేశాలలో భగవంతుని భావన విశేషంగా ఉంటుంది. హృదయంలో ఆత్మరూపములో, భ్రూమధ్యంలో జీవరూపములో, సహస్రారంలో పరమాత్మరూపములో ఉంటుంది. 
'న' అంటే లేదు, 'మ' అంటే నాది అయినటువంటిది అని అర్ధం. నమః అంటే నాదంటూ ఏదిలేదని అర్ధం. భగవంతున్ని నమష్కరించడం అంటే నాదంటూ ఏదిలేదని, ఉన్నదంతా నీదే (పరమాత్మదే) అని శరణాగతి భావమును తెలపడం.

పూజకు వినియోగించే పదార్దముల అంతరార్ధం :-
 కృష్ణభగవానుడు చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయంలకు అర్ధమేమిటంటే - పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి. 

కొబ్బరికాయ :-
 కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. కొట్టిన కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే - లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు. అలానే కొబ్బరికాయపై పీచును తమోగుణమునకు ప్రతీకగా, గట్టిగా ఉండే టెంక రజోగుణమునకు ప్రతీకగా, లోపల ఉన్న తెల్లని కొబ్బరిని సత్వగుణమునకు ప్రతీకగా విశీదకరిస్తూ, మనలో ఉన్న త్రిగుణములను బద్దలుకొట్టి పావనమైన అంతఃకరణమును కొబ్బరినీరుగా భగవంతునికి అర్పించడమనే అర్ధాని కొందరు చెప్తారు

ధూపం :- 
సువాసనభరితమైన ధూపం మనలో వున్న చెడువాసనలను తొలగించాలని వెలిగిస్తాం.

హారతి స్తుతి :-
ఆరోగ్యం ఆయుష్యం అనంతసౌఖ్యం 
సంపత్సముర్ధ్యం శుభసన్నిధానం 
కర్పూరదీవేన లభస్త్యదేహి 
నీరాజనయే వేంకటనాధ నిత్యమ్ ||

మనలోనికి కర్మవాసనలన్నియు కర్పూరముల పూర్తిగా క్షయింపబడాలని. ఏ శేషములేకుండా భగవంతుని ముందు వెలిగించిన హారతి భగవంతునిలో కైకర్యం చెందినట్లుగా భక్తిభావంతో మనలోవెలుగుతున్నఆత్మ పరమాత్ముని యందు ఐక్యంకావాలని కోరుకోవడం. హారతిని కళ్ళకు అద్దుకోవడమంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని. 

గంట :- 
మనస్సు ఎన్నో విషయాలు (జ్ఞాపకాలు, ఆలోచనలతో) తో నిండి ఉంటుంది. వాటన్నింటిని విడిచి కొన్ని క్షణములైన దైవమందు మనస్సు నిల్పవలయునని ఉద్దేశ్యంతో గంటను పుజాసామగ్రిలో ఓ భాగంగా పూర్వీకులు ప్రవేశపెట్టారు. ఘంటారావం వినగానే అనేక విషయాలయందు తిరిగే మనస్సు ఆ నాదమందైక్యమై నాదం ఏకస్థాయికి వచ్చునట్లు మనస్సు కూడా ఏకస్థాయికి వచ్చును అని పెద్దలు చెప్తారు. ఘంటానాదం నిశ్చబ్ధ స్థితిలోకి తీసుకువెళ్ళి, మన మనస్సును నిజ తత్వమైన ఆత్మవైపు కాసేపైన మళ్ళిస్తుంది. శబ్దంలోనుంచి నిశ్శబ్ధం, శూన్యంలోకి వెళ్ళమని గంట సూచిస్తుంది.

నైవేద్య నివేదన శ్లోకం :-
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే 
తేన త్వదంఘ్రి కమలే భక్తిం మే యచ్చ శాశ్వతీం ||

గోవిందా! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను. వీనితో నీ చరణకమలాలపై శాశ్వతమైన భక్తి కలుగునట్లు ప్రసాదించు.

ప్రదక్షిణ స్తుతి :-
 యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే  ||

ప్రదక్షిణ అనగా నేను అన్నివైపుల నుండి నిన్నే కాంచుతూ నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం. 'ప్ర' అనగా పాపాల నాశనమని, 'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అనగా మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని, 'ణ' అంటే అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానమును ఇవ్వమనే అర్ధమును కొందరు చెప్తారు. 

దివ్యమంగళకరమగు భగవద్విగ్రహంను దర్శిస్తూ నేతేన్ద్రియములు భక్తిత్వంలో లయించును. సుగంధ ధూపవాసనలచే ఘ్రానేన్ద్రియం లయించును. ఓంకారం, గంటానాదం, శంఖారావం, మంత్రోచ్చారణలయందు కర్ణేన్ద్రియములు లీనమగును. భాగావన్నామోచ్చారణల చేతను, తీర్ధాది ప్రసాదముల చేతను జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు పసుపుకుంకుమ చందనాదులచే త్వగింద్రియం శాంతంనొంది పవిత్రభావాలతో పులకరించును. పంచేంద్రియములు ఇలా ఒకే ధ్యాసతో భక్తిభావంనందు లయమైనప్పుడే మనస్సు కూడా పూర్తిగా ఏకాగ్రతతో యందు లయించును.

సూర్య స్తుతి :-
 ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మామ భాస్కర 
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 
 
సప్తాశ్వరధ మారుడం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 
 
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్ 
మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||

తులసి స్తుతి:-
యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః 
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ ||

లేదా 

ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే 
క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్ ||

నవగ్రహ స్తుతి :- 
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ 
గురు శుక్ర శనిభ్యశ్ఛ రాహవే కేతవే నమః ||

గురు స్తుతి :-
 గురు బ్రహ్మా గురు విష్ణు: గురు దేవో మహేశ్వరః 
గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః  ||

లేదా 

అఖండ మండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ 
తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీ గురవే నమః ||

లేదా 

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా 
చక్షురున్మీలితం యేవ తస్మై శ్రీ గురవే నమః ||

భోజనమునకు ముందు :- 
(ఏది భుజించినను భగవంతుని ప్రసాదముగానే స్వీకరించాలి)

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లబే 
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి ||

లేదా 

అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః 
ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే ||

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ 
బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||
 
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః 
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||

భోజనము తర్వాత :- 
అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలమ్ 
ఆహారపరిణామార్ధం స్మరామి చ వృకోదరమ్ ||

విష్ణు: సమస్తేంద్రియ దేహదేహీ ప్రదానభూతో భగవాన్ యధైకః 
సత్యేన తేనాత్త మశేష మన్నం ఆరోగ్యదం మే పరిణామ మేతు ||

ప్రయాణం విధి :-
జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః 
అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః ||

నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!
 
లేదా 

వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ 
శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు ||

లేదా 

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

కార్యసిద్ధి :- 
వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ 
సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వకార్యార్ధ సిద్ధయే ||

స్మృతి సిద్ధి :-
శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః 
కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః ||
(అనుకున్నది సిద్ధించడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి) 

చంద్ర దర్శన స్తుతి :-
క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర 
మహేశమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే ||

గోవు దర్శన స్తుతి :-
గావో మే చాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ 
గావో మే హృదయేచైవ గవాం మధ్యే వసామ్యహమ్ ||

మంగళం దర్శనం ప్రాతః పూజానం పరమం పదమ్ 
స్పర్శనం పరమం తీర్ధం నాస్తి ధేనుసమం క్వచిత్ ||

ఔషద విధి :- 
ధన్వంతరిం గురుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభమ్ 
అచ్యుతం చామృతం చంద్రం స్మరే దౌషధకర్మణి ||

లేదా 

శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే 
ఔషదం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి: ||

లేదా 

అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ 
నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ ||

శయనవిధి :-
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం 
శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తన్న నశ్యతి ||

లేదా 

అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః 
కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః ||

లేదా 

హనుమా నంజనాసూను: వాయుపుత్రో మహాబలః 
రామేష్ఠ: ఫల్గునసఖః పింగాక్షోమిత విక్రమః 
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః 
లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా 
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠే న్నిత్యం యాత్రాకాలే విశేషతః 
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్.

కుంకుమ ధారణ :-
కుంకుమస్త్రీ పురుషులు ధరించడం మన సనాతన ఆచారం. ఇది తప్పనిసరి. ఎందుకంటే - రెండు కనుబొమలకు మద్యభాగమైన నుదుటిస్థానం 'ఇడ' 'పింగళ' 'సుషుమ్న' అనే ప్రధాన నాడుల సంగమస్థానం. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్తారు. కుంకుమ మనిషిలోని మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, సహృదయతను పెంపొందిస్తుంది. మనం బొట్టు పెట్టుకునే చోటే అజ్ఞాచక్రం ఉంటుంది. దానికి త్రివేణి సంగమమని, అమృతస్థానమని పేరు. ధ్యానానికి ఇది ముఖ్యస్థానం. ఈచోట కుంకుమధారణ వలన పుష్టి, భక్తి, ఐశ్వర్యం మొదలైనవి కలుగుతాయి.