Thursday, 6 February 2014

Pooja vidhanam

ఉదయం లేవగానే - 

కరదర్శనం :-
కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి 
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం ||

చేయి పైభాగాన లక్ష్మీ, మధ్యభాగమున సరస్వతి, చివరిభాగమున గౌరీదేవి వున్నందున ప్రాతః కాలమున ఈ శ్లోకం చదివి మన రెండు చేతులను కళ్ళకు అద్దుకోవలెను. 

లేదా

మూడుసార్లు శ్రీహరి, శ్రీహరి శ్రీహరి అని తలస్తూ కరదర్శనం చేసుకోవలెను)

భూప్రార్ధన :- 
సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే 
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్యమే ||

పాదస్పర్శతో భూదేవిని బాధిస్తున్నందుకు క్షమాపణ చెప్తూ కాలిని నేలకు ఆన్చాలి. 
లేదా 

పాదస్పర్శ క్షమస్వమే, భూదేవి నమోస్తుతే ||

అనైన ప్రార్ధించవచ్చును

ప్రాతః స్మరణ :-
బ్రహ్మ మురారి స్త్రిపురాంతకశ్చ, భాను శ్శశీ భూమిసుతో బుధశ్చ 
గురుశ్చ శుక్ర శ్శని రాహు కేతవః, కుర్వంతం సర్వే మమ సుప్రభాతమ్ ||

త్రిమూర్తులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు నాకు మేలు చేయుదురుగాక! 

లేదా 

హరం హరిం హరిశ్చంద్రం హనూమంతం హలాయుధమ్ 
పంచకం వై స్మరేన్నిత్యం ఘోరసంకటనాశనమ్ ||

స్నాన విధి :- 
గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ||

లేదా 

యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః 
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః ||

భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ 
మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ ||

బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి.

ఆత్మను పరమాత్మలో లయం చేయడానికి మన పూజావిధానం ఒక ఉతమోత్తమ మార్గం. దేవుని విగ్రహం లేదా చిత్రం విశ్వాత్మకు ప్రతిబింబం. విగ్రహం భూతత్వమైనది. అలానేసాంబ్రాణి ధూపం భూతత్వమైన వాసన కల్గివుంటుంది. ఇవి మూలాధారచక్రమును ఉత్తేజితం చేస్తుంది. అలానే తీర్ధ ప్రసాదాలు రుచి ద్వారా స్వాదిష్టానాన్ని ఉత్తేజితం చేస్తుంది. దీపం, హారతి ద్వారా జనించిన అగ్ని మణిపూరచక్రమును, గంధం, అగరబత్తిల ద్వారా వాయుతత్వమైన అనాహతచక్రమును, గంటానాదం ద్వారా విశుద్ధిచక్రం ఉత్తేజితం అవుతాయి. తద్వారా ఆజ్ఞాచక్రం, సహస్రారం జాగృతం అవుతాయి. ఇట్లా మనలోని నాడీకేంద్రాలను జాగృతం చేసుకోవడానికి పూజావిధానాన్ని ప్రాచీన మహర్షులు మనకందించారు. మంత్రాలు, ప్రార్ధనలు, సంకీర్తనలు, అర్చనలు, పూజలు ద్వారా మన షట్చక్రాలను మేలుకొల్పి కుండలినీశక్తిని పైకి నడిపి సహస్రారంలో గల పరమాత్మతత్వాన్ని ఆరాదిస్తున్నాం.

పూజావిధం :-
 చిత్రం, మృత్తిక, శిల, దారువు, లోహం.... దేనితో తయారైనదైనా దానిని భగవంతుని ప్రతిరూపముగా భావించి పూజిస్తాం. [ఈ రూపాలు మన ప్రగాడ విశ్వాసభావనతో ఏర్పరుచుకున్నవి]

న తే రూపం న చాకారో నాయుధాని న చాన్పదమ్ 
తధ్కాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశాసే  ||

భగవంతునికి ప్రత్యేకముగా ఒక్క రూపముగాని, ఒక్క ఆకారముగాని, ఆయుధముగాని (శంఖు,చక్ర,డమరు మొదలగు), వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగాని లేనప్పటికిని భక్తవత్సలగుటచేతను, పరమకరుణాస్వరూపులగుటచేతను భక్తులయొక్క భావమును అనుసరించి అనేకరూపములను ధరించుచున్నారు. 

యే యధా మాం ప్రవద్యంతే తాంస్తదైవ భజామ్యహం ..... ఎవరు ఎలాంటి భావముతో నన్ను ఉపాసింతురో వారికాలాంటి భావముతో దర్శనమిత్తును. 

దీపస్తుతి :-
దీపం జ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ 
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే 

దీపజ్యోతే పరబ్రహ్మం. దీపజ్యోతే అన్ని తమో గుణాలని హరించేది. దీపం వల్లే సర్వం సాధ్యం. సంధ్యలో వెలిగే దీపానికి నమస్కారాలు. [దీపకాంతిలో తమోరజో గుణాలు హరిస్తాయి]

నమస్కారం :-
 పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః 
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల  ||

తలవంచి రెండు చేతులు జోడించి హృదయం వద్దగానీ, భ్రూమధ్యంలో గానీ, నెత్తి పై అంటే సహస్రారంపై గానీ పెట్టి నమస్కరించడానికి కారణం ఏమిటంటే - మూడు ప్రదేశాలలో భగవంతుని భావన విశేషంగా ఉంటుంది. హృదయంలో ఆత్మరూపములో, భ్రూమధ్యంలో జీవరూపములో, సహస్రారంలో పరమాత్మరూపములో ఉంటుంది. 
'న' అంటే లేదు, 'మ' అంటే నాది అయినటువంటిది అని అర్ధం. నమః అంటే నాదంటూ ఏదిలేదని అర్ధం. భగవంతున్ని నమష్కరించడం అంటే నాదంటూ ఏదిలేదని, ఉన్నదంతా నీదే (పరమాత్మదే) అని శరణాగతి భావమును తెలపడం.

పూజకు వినియోగించే పదార్దముల అంతరార్ధం :-
 కృష్ణభగవానుడు చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయంలకు అర్ధమేమిటంటే - పత్రం అంటే దేహం. ఈ శరీరమును వినియోగిస్తూ చేసే క్రియలను భక్తిభావముతో కృష్ణార్పణం చేయాలి.(ప్రారబ్ధకర్మనుండి విముక్తి కల్గుతుంది) పుష్పం అంటే హృదయం. పుష్పములా సున్నితముగా, సువాసనభరితంగా, స్వచ్ఛముగా వున్నా హృదయమును సమర్పించాలి. ఫలం అంటే కర్మఫలం. ఫలములో విత్తనములు వుంటాయి, అవి నాటితే తిరిగి చిగురిస్తాయి. అలానే కర్మల వలన జన్మించాల్సివస్తుంది. అలానే కర్మఫలాన్ని అనుభవించాల్సివస్తుంది. అలా కాకుండా త్రికరణశుద్ధిగా కర్మఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తే కర్మబంధం తప్పుతుంది.(దీనివలన సంచిత, ఆగామి కర్మలనుడి విముక్తికల్గుతుంది) తోయమనగా భక్తిరసం. ఆరాధనతో, ఆర్తితో పరిపూర్ణ శరణాగతి భక్తిభావముతో మనస్సు ఉప్పొంగికార్చే ఆనందభాష్పాలను సమర్పించాలి. 

కొబ్బరికాయ :-
 కొబ్బరికాయ కొడుతున్నామంటే మన అహంకారమును వీడుతున్నామని. కొట్టిన కొబ్బరిచెక్కలను భగవంతునికి సమర్పించడమంటే - లోపలున్న తెల్లనికొబ్బరిలా మన మనస్సును సంపూర్ణముగా భగవంతుని ముందు పరిచామని. తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా మన జీవితాలని వుంచమని అర్ధం. కొబ్బరి బయటిభాగం మన శరీరమని, లోపలభాగం మన మనస్సని, మూడుకళ్ళు ఇడా,పింగళ, సుషమ్ననాడులని కూడా పెద్దలు చెప్తారు. అలానే కొబ్బరికాయపై పీచును తమోగుణమునకు ప్రతీకగా, గట్టిగా ఉండే టెంక రజోగుణమునకు ప్రతీకగా, లోపల ఉన్న తెల్లని కొబ్బరిని సత్వగుణమునకు ప్రతీకగా విశీదకరిస్తూ, మనలో ఉన్న త్రిగుణములను బద్దలుకొట్టి పావనమైన అంతఃకరణమును కొబ్బరినీరుగా భగవంతునికి అర్పించడమనే అర్ధాని కొందరు చెప్తారు

ధూపం :- 
సువాసనభరితమైన ధూపం మనలో వున్న చెడువాసనలను తొలగించాలని వెలిగిస్తాం.

హారతి స్తుతి :-
ఆరోగ్యం ఆయుష్యం అనంతసౌఖ్యం 
సంపత్సముర్ధ్యం శుభసన్నిధానం 
కర్పూరదీవేన లభస్త్యదేహి 
నీరాజనయే వేంకటనాధ నిత్యమ్ ||

మనలోనికి కర్మవాసనలన్నియు కర్పూరముల పూర్తిగా క్షయింపబడాలని. ఏ శేషములేకుండా భగవంతుని ముందు వెలిగించిన హారతి భగవంతునిలో కైకర్యం చెందినట్లుగా భక్తిభావంతో మనలోవెలుగుతున్నఆత్మ పరమాత్ముని యందు ఐక్యంకావాలని కోరుకోవడం. హారతిని కళ్ళకు అద్దుకోవడమంటే మన దృష్టి అంతర్ముఖం కావాలని. 

గంట :- 
మనస్సు ఎన్నో విషయాలు (జ్ఞాపకాలు, ఆలోచనలతో) తో నిండి ఉంటుంది. వాటన్నింటిని విడిచి కొన్ని క్షణములైన దైవమందు మనస్సు నిల్పవలయునని ఉద్దేశ్యంతో గంటను పుజాసామగ్రిలో ఓ భాగంగా పూర్వీకులు ప్రవేశపెట్టారు. ఘంటారావం వినగానే అనేక విషయాలయందు తిరిగే మనస్సు ఆ నాదమందైక్యమై నాదం ఏకస్థాయికి వచ్చునట్లు మనస్సు కూడా ఏకస్థాయికి వచ్చును అని పెద్దలు చెప్తారు. ఘంటానాదం నిశ్చబ్ధ స్థితిలోకి తీసుకువెళ్ళి, మన మనస్సును నిజ తత్వమైన ఆత్మవైపు కాసేపైన మళ్ళిస్తుంది. శబ్దంలోనుంచి నిశ్శబ్ధం, శూన్యంలోకి వెళ్ళమని గంట సూచిస్తుంది.

నైవేద్య నివేదన శ్లోకం :-
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే 
తేన త్వదంఘ్రి కమలే భక్తిం మే యచ్చ శాశ్వతీం ||

గోవిందా! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను. వీనితో నీ చరణకమలాలపై శాశ్వతమైన భక్తి కలుగునట్లు ప్రసాదించు.

ప్రదక్షిణ స్తుతి :-
 యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ 
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే  ||

ప్రదక్షిణ అనగా నేను అన్నివైపుల నుండి నిన్నే కాంచుతూ నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్ధం. 'ప్ర' అనగా పాపాల నాశనమని, 'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అనగా మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని, 'ణ' అంటే అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానమును ఇవ్వమనే అర్ధమును కొందరు చెప్తారు. 

దివ్యమంగళకరమగు భగవద్విగ్రహంను దర్శిస్తూ నేతేన్ద్రియములు భక్తిత్వంలో లయించును. సుగంధ ధూపవాసనలచే ఘ్రానేన్ద్రియం లయించును. ఓంకారం, గంటానాదం, శంఖారావం, మంత్రోచ్చారణలయందు కర్ణేన్ద్రియములు లీనమగును. భాగావన్నామోచ్చారణల చేతను, తీర్ధాది ప్రసాదముల చేతను జిహ్వేంద్రియం లయించును. పరిమిళమిళిత శీతలదాయకమగు పసుపుకుంకుమ చందనాదులచే త్వగింద్రియం శాంతంనొంది పవిత్రభావాలతో పులకరించును. పంచేంద్రియములు ఇలా ఒకే ధ్యాసతో భక్తిభావంనందు లయమైనప్పుడే మనస్సు కూడా పూర్తిగా ఏకాగ్రతతో యందు లయించును.

సూర్య స్తుతి :-
 ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మామ భాస్కర 
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే 
 
సప్తాశ్వరధ మారుడం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 
 
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్ 
మహాపాపహారం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||

తులసి స్తుతి:-
యన్మూలే సర్వతీర్ధాని యన్మధ్యే సర్వదేవతాః 
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ ||

లేదా 

ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే 
క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్ ||

నవగ్రహ స్తుతి :- 
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ 
గురు శుక్ర శనిభ్యశ్ఛ రాహవే కేతవే నమః ||

గురు స్తుతి :-
 గురు బ్రహ్మా గురు విష్ణు: గురు దేవో మహేశ్వరః 
గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః  ||

లేదా 

అఖండ మండలాకారం వ్యాప్తం యేవ చరాచరమ్ 
తత్పదం దర్శితం యేవ తస్మై శ్రీ గురవే నమః ||

లేదా 

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా 
చక్షురున్మీలితం యేవ తస్మై శ్రీ గురవే నమః ||

భోజనమునకు ముందు :- 
(ఏది భుజించినను భగవంతుని ప్రసాదముగానే స్వీకరించాలి)

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లబే 
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతి ||

లేదా 

అన్నం బ్రహ్మరసో విష్ణు: భోక్తా దేవో మహేశ్వరః 
ఇతిస్మరన్ ప్రభుం జానః దృష్టి దోషై: నలిప్యతే ||

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ 
బ్రహ్మైవ తేవ గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ||
 
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః 
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||

భోజనము తర్వాత :- 
అగస్త్యం కుంభకర్ణంచ శమ్యంచ బడబానలమ్ 
ఆహారపరిణామార్ధం స్మరామి చ వృకోదరమ్ ||

విష్ణు: సమస్తేంద్రియ దేహదేహీ ప్రదానభూతో భగవాన్ యధైకః 
సత్యేన తేనాత్త మశేష మన్నం ఆరోగ్యదం మే పరిణామ మేతు ||

ప్రయాణం విధి :-
జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః 
అతవ్యాం నారసింహశ్చ సర్వతః పాతుకేశవః ||

నీటిబాధనుంచి వరాహావతారం, భూ సంబంధమైన బాధలనుంచి వామనావతారం, అడవుల్లోని బాధలనుంచి నరసింహావతారం, అన్ని బాధలనుంచి అన్ని అవతారాలకి మూలమైన శ్రీహరి రక్షించుగాక!
 
లేదా 

వనమాలీ గదీ శారజ్ఞి శంఖీ చక్రీ చ నందకీ 
శ్రీమాన్ నారాయణో విష్ణు: వాసుదేవోభిరక్షతు ||

లేదా 

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్ 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||

కార్యసిద్ధి :- 
వినాయకం గురుం భానుం బ్రహ్మ విష్ణు మహేశ్వరాన్ 
సరస్వతీం ప్రణమ్యాదౌ సర్వకార్యార్ధ సిద్ధయే ||

స్మృతి సిద్ధి :-
శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః 
కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః ||
(అనుకున్నది సిద్ధించడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి) 

చంద్ర దర్శన స్తుతి :-
క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర 
మహేశమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే ||

గోవు దర్శన స్తుతి :-
గావో మే చాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవ చ 
గావో మే హృదయేచైవ గవాం మధ్యే వసామ్యహమ్ ||

మంగళం దర్శనం ప్రాతః పూజానం పరమం పదమ్ 
స్పర్శనం పరమం తీర్ధం నాస్తి ధేనుసమం క్వచిత్ ||

ఔషద విధి :- 
ధన్వంతరిం గురుత్మంతం ఫణిరాజం చ కౌస్తుభమ్ 
అచ్యుతం చామృతం చంద్రం స్మరే దౌషధకర్మణి ||

లేదా 

శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే 
ఔషదం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి: ||

లేదా 

అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ 
నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ ||

శయనవిధి :-
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం 
శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తన్న నశ్యతి ||

లేదా 

అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః 
కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః ||

లేదా 

హనుమా నంజనాసూను: వాయుపుత్రో మహాబలః 
రామేష్ఠ: ఫల్గునసఖః పింగాక్షోమిత విక్రమః 
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః 
లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా 
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పఠే న్నిత్యం యాత్రాకాలే విశేషతః 
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్.

కుంకుమ ధారణ :-
కుంకుమస్త్రీ పురుషులు ధరించడం మన సనాతన ఆచారం. ఇది తప్పనిసరి. ఎందుకంటే - రెండు కనుబొమలకు మద్యభాగమైన నుదుటిస్థానం 'ఇడ' 'పింగళ' 'సుషుమ్న' అనే ప్రధాన నాడుల సంగమస్థానం. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్తికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతమైతే, స్త్రీలకు ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్తారు. కుంకుమ మనిషిలోని మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, సహృదయతను పెంపొందిస్తుంది. మనం బొట్టు పెట్టుకునే చోటే అజ్ఞాచక్రం ఉంటుంది. దానికి త్రివేణి సంగమమని, అమృతస్థానమని పేరు. ధ్యానానికి ఇది ముఖ్యస్థానం. ఈచోట కుంకుమధారణ వలన పుష్టి, భక్తి, ఐశ్వర్యం మొదలైనవి కలుగుతాయి.

No comments:

Post a Comment